ఖమ్మం అర్బన్, మే 11 : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్-2026 పరీక్ష ఈ నెల 13న నిర్వహించనున్నట్లు పాలీసెట్ నగర కోఆర్డినేటర్, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ జాకీరుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని ఆరు కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్లో 800 మంది, ఎస్బీఐటీలో 600, కేఎండీసీలో 600, డేర్‌లో 500, డీఆర్ఎస్లో 504, యూనివర్సిటీ పీజీ కళాశాలలో 153 మంది.. మొత్తం 3,157 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.
ఈ నెల13వ తేదీ నుంచి నిర్వహించే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో సీఎస్, డీవోలు నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని డీఐఈవో రవిబాబు సూచించారు. నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం సీఎస్, డీవోలు, కస్టోడియన్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 37 కేంద్రాల్లో రెండు సెషన్స్‌లో పరీక్షలు జరుగుతాయని, ప్రశ్న, జవాబు పత్రాలు పోలీస్ ఎస్కార్ట్ ద్వారా రవాణా చేయాలని స్పష్టం చేశారు. హాల్ టికెట్లలో తప్పులు దొర్లితే సంబంధిత కళాశాలల ద్వారా డీఐఈవో ఆఫీస్‌లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో డెక్ సభ్యులు సింహాచలం, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.