అచ్చంపేట: అమ్రాబాద్ మండలం దోమలపెంట ( Domala Penta ) గ్రామంలో తాగడానికి గుక్కెడు మంచినీళ్లు ( Driking Water ) ఇవ్వండి మహాప్రభో అంటూ గ్రామస్థులు, మహిళలు రోడ్డెక్కారు. మంగళవారం శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన రహదారిపై గ్రామం మధ్యన నీళ్ల డ్రమ్ములు, బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. పక్కనే కృష్ణానది ( Krishna River ) ఒడ్డున ఉన్న దోమలపెంటకు తాగడానికి నీళ్లు రాకపోవడం విచారకరమని ఆరోపించారు.
ఇక్కడినుంచే ఎస్ఎల్బీసీ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇతర జిల్లాలకు సాగు, తాగునీటి కోసం నీటిని తీసుకెళుతున్న పాలకులు నది పక్కనే ఉన్న తమకు తాగడానికి నీళ్లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇలాంటి పాలకులు ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని విమర్శించారు. ఆందోళన చేసినప్పుడు నాలుగు రోజులు నీళ్లు వదిలి మళ్లీ తమ పరిస్థితి యథావిధిగా ఉంటుందని ఆరోపించారు.
మోటారు , పైపులైన్లు మరమ్మతు చేయక పోవడంతో తమకు నీళ్లు రావడం లేదని మాజీ ఉపసర్పంచ్ మహేష్ విమర్శించారు. దాదాపు గంటపాటు గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించడంతో శ్రీశైలం- హైదరాబాద్ వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.