హైదరాబాద్ సిటీబ్యూరో/హిమాయత్‌నగర్, ఆగస్ట్ 25 (నమస్తే తెలంగాణ): భూమి హక్కులు, సరిహద్దులు, సర్వే నంబర్లు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత కీలకమైన విలేజ్ మ్యాప్‌లు, టిప్పన్లు, సేత్వార్ తదితర రికార్డులు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సర్వే కార్యాలయంలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఉన్న ‘సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్’ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నోటీసులు ఈ పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. కార్యాలయంలోని కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన నోటీసుల ప్రకారం.. ‘ప్రింటర్ స్లాటర్ మరమ్మతులో ఉన్నందున ప్రింటర్ రిపేర్ అయ్యేవరకు ఈ కార్యాలయం నుంచి మ్యాప్‌లు ఇవ్వబడవు’ అని పేర్కొన్నారు. మరో నోటీసులో సేత్వార్, టిప్పన్లు, ఇతర సంబంధిత రికార్డులు కూడా అందుబాటులో లేవని, సంబంధిత డీఎంయూ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ ప్రాంతంలో 1920 నుంచి బాంబే విధానంలో సర్వే చేపట్టి 1956 వరకు సర్వే పనులు పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో ప్రతి భూమికీ సర్వే నంబర్ కేటాయించి ప్రతి రెవెన్యూ గ్రామానికీ విలేజ్ మ్యాప్‌లు, డ్రై/వెట్ మ్యాప్‌లు, టిప్పన్లు, సేత్వార్, వసూల్‌బాకీ తదితర రికార్డులు రూపొందించారు. ఈ రికార్డుల ఆధారంగానే రైతుల భూ హద్దులు, గ్రామ సరిహద్దుల వివాదాలను పరిష్కరించేవారు. సర్వే శాఖ నిర్వహించే రికార్డుల్లో విలేజ్ మ్యాప్ అత్యంత కీలకమైనది. ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించడం, ప్రైవేట్ భూముల మధ్య హద్దు వివాదాలను పరిష్కరించడం, భూ హక్కులను నిర్ధారించడంలో ఈ రికార్డులకు ప్రాధాన్యత ఉంది. నారాయణగూడలో ఉన్న ఈ సర్వే డిపార్ట్మెంట్లోనే విలేజ్ మ్యాప్‌లను తయారుచేసే యంత్రం పనిచేయకపోవడంతో ప్రజలకు మ్యాప్‌లు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. గత మూడు నెలల నుంచి ప్రింటర్ పనిచేయకపోవడంతో రాష్ట్రం నలుమూలల నుంచి మ్యాప్‌ల కోసం వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విలేజ్ మ్యాప్‌లు హైదరాబాద్ నగర శివారుతోపాటు రియల్ఎస్టేట్ వ్యాపారానికి కీలకంగా మారాయి. ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులు కొందరు చేస్తున్న భూ మాఫియాకు ఈ మ్యాప్‌లు అడ్డంకిగా మారే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెమ్మదిగా సర్వే విభాగంలోని మ్యాప్‌లు ఇచ్చే వ్యవస్థను తగ్గిస్తూ వచ్చారు. గామ మ్యాప్‌లు ప్రస్తుతం జరుగుతున్న అసైన్డ్ భూములు, ఇతర ప్రభుత్వ భూముల వివరాలు తెలిపే అవకాశమున్నందున, ఎక్కడా ఆ మ్యాప్‌లు దొరుకకుండా కొందరు షాడోలు ముందుగానే జాగ్రత్తలు పాటిస్తూ సర్వేలో మ్యాప్‌లే బయటకు రాకుండా అడ్డుకట్ట వేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే శాఖకు సంబంధించిన ముఖ్య అధికారిని ఈ రిపేర్లపై వివరణ అడిగితే తాము సెక్రటరీకి లేఖ రాశామని చెప్పారు.