ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ :ఈ నెల 27న నిర్వహించనున్న గ్రామపాలన అధికారుల స్క్రీనింగ్ (Village Administrative Officer) , లైసెన్స్డ్ సర్వేయర్ల (Licensed Surveyors) అర్హత పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే (Venkatesh Dhotre) అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ భవనంలో సంబంధిత అధికారులతో పరీక్షల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
పరీక్షను జిల్లా కేంద్రంలోని జనకాపూర్లోపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతుందని వివరించారు. గ్రామపాలన అధికారులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, సర్వేయర్లకు 2 సెషన్లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.
సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసే పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. ముఖ్య పర్యవేక్షకులు, ఇన్విజిలేటర్లు, పరిశీలకులు, రూట్ అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష జరిగే సమయంలో విద్యుత్ కోత లేకుండా చూడాలని, పరీక్ష కేంద్రాలలో పారిశుద్ధ్య పనులు, త్రాగునీరు, ఫర్నిచర్, ఫ్యాన్లు ఉండేలాగా చూడాలని తెలిపారు.
ఆర్టీసీ అధికారులు సమయానుకూలంగా బస్సులు నడపాలని, వైద్య, ఆరోగ్యశాఖ తరఫున పరీక్ష కేంద్రం వద్ద అవసరమైన మందులతో శిబిరం నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, విద్యుత్ శాఖ ఎస్ఈ శేషరావు, డిపో మేనేజర్, మున్సిపల్ కమిషనర్ గజానన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.