షాబాద్, నవంబర్ 15: వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు షాబాద్ మండలంలోని పోలారం రైతులు. వరి సాగుచేస్తే నాలుగు నెలల వరకు దిగుబడి కోసం ఎదురుచూడాల్సి వస్తుండడంతో ఇతర పంటలపై దృష్టి సారించి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందుతున్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. వరి జోలికి వెళ్లకుండా ఏడాది పొడవునా కూరగాయలు సాగు చేస్తూ పంట ఉత్పత్తులను శంషాబాద్, చేవెళ్ల, షాద్నగర్ మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు.
150 ఎకరాలు..
గ్రామంలో సుమారు 30 మంది రైతులు 150 ఎకరాల్లో టమాట, బెండ, చిక్కుడు, బీట్రూట్, క్యారెట్, క్యాబెజీ, కాలీప్లవర్, వంకాయ తదితర పంటలు సాగు చేస్తున్నారు. కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం కిలో టమాట రూ. 50కి, వంకాయ రూ.40 ధర పలుకుతుడడంతో మంచి ఆదాయం సమకూరుతున్నది. బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉన్నా.. రైతుల డ్రిప్ పద్ధతి ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయల తోటలు సాగు చేస్తున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా కాయగూరల పంటలే కనిపిస్తున్నాయి. వీరిని చూసి మరింత మంది ఆరుతడి పంటలపై ఆసక్తి చూపుతున్నారు.
తక్కువ సమయంలోనే దిగుబడి..
చాలామంది గ్రామ రైతులు వరి సాగుకు దూరంగా ఉన్నారు. వరికి సాగునీరు అధికంగా అవసరం ఉండడం, నాలుగు నెలల వరకు ఎలాంటి ఆదాయం లేకపోవడం, చీడపీడల బెడద , నాటేసేందుకు కూలీల కొరత, పెట్టుబడి వ్యయం తడిసి మోపెడవుతుండడంతో ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి చూపుతున్నారు. కాయగూరలు సాగు చేస్తే కేవలం నెల, రెండు నెలల నుంచే దిగుబడులు మొదలై ఆశించిన లాభాలు వస్తున్నాయి. మార్కెట్ సదుపాయం కూడా ఉండడంతో పోలారం రైతులు కూరగాయలను సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం అధిక ధరలు ఉండడంతో కూరగాయల విక్రయం ద్వారా ఒక్కో రైతు అన్ని ఖర్చులు పోను రూ. 50నుంచి రూ. 60వేల వరకు ఆదాయం పొందుతున్నాడు.