పెద్దేముల్, అక్టోబర్ 30 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ నిఖిల, డీఈవో రేణుకాదేవి శనివారం వేర్వేరుగా సందర్శించారు. కలెక్టర్ నిఖిల బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలిస్తూ పాఠశాలలో ఎన్ని గదులున్నాయి? ఎన్ని గదులు శిథిలావస్థలో ఉన్నాయి? వెనుకభాగంలో కొనసాగుతున్న 8, 9, 10 తరగతి గదుల నిర్మాణం ఎప్పుడు జరిగింది? పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎంత? పాఠశాలకు కిచెన్ షెడ్ లేదా? ఉంటే చాలా చిన్నదిగా ఎందుకు ఉంది? అని ఉపాధ్యాయులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 8, 9, 10 తరగతి గదుల పైభాగంలో అదనపు గదులను కూడా నిర్మించడానికి అవకాశం ఉంటుంది కదా అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పాఠశాలను పరిశీలించి మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం విద్యార్థులకు పెడుతున్నారా? లేదా? పాఠశాలలో శనివారం ఎంతమంది విద్యార్థులకు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారు? ఎంత మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు? క్రమంగా తప్పకుండా 3 ఆర్స్ కొనసాగుతున్నాయా? బెస్లైన్ టెస్ట్ రిపోర్ట్ ఎంఆర్సీకి పంపడం.. తదితర విషయాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉండకుండా విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించాలన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోరారు. అంతకుముందు స్థానికంగా ఉన్న ఐఈఆర్టీ కేంద్రాన్ని సందర్శించి శనివారం హాజరైన ఇద్దరు విద్యార్థులతో మాట్లాడి కలర్ బ్లాక్స్లో నీలి రంగు, పసుపు రంగు గుర్తించాలని కోరగా ఇద్దరు విద్యార్థులు కరెక్టుగా గుర్తించడంతో వారిని అభినందించారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పాఠ్యాంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతప్ప, మల్లమ్మ, ఎమ్మార్వో ఫహీం ఖాద్రీ, ఎంపీవో షేక్ సుష్మా, పంచాయతీ కార్యదర్శి సుధారాణి ఉన్నారు.