పరిగి, అక్టోబర్ 30 : అభివృద్ధి పనుల్లో జాప్యం తగదని, వేగంగా పనులు జరిగేలా చూడాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి ఆదేశించారు. శనివారం వికారాబాద్‌లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జిల్లాస్థాయి సంఘాల సమావేశాల్లో ప్రభుత్వ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 1766 పనులు మంజూరవగా 1157 పనులు పూర్తయ్యాయని, మిగతావి వివిధ దశల్లో ఉన్నట్లు చెప్పారు. పనులలో వేగం పెంచాలని ఆమె సూచించారు. జిల్లా పరిషత్ నుంచి పల్లెల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, గ్రామపంచాయతీల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, జాప్యం లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో కేరళ వలే పచ్చదనం పెరగాలని అధికారులకు సూచించారు. కేరళలలో ఎటు వెళ్లినా రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో చెట్లతో పచ్చదనం ఉంటుందని, మొక్కలు నాటడం, వాటి సంరక్షణ నిరంతరం చేపట్టడం ద్వారా పచ్చదనం పెరుగుతున్నదని చెప్పారు. గ్రామాల్లో ఇండ్లు నిర్మించుకునేవారు తప్పనిసరిగా ఇంకుడుగుంత తవ్వితేనే ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్నారు.
ఈసారి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనందున పదో తరగతిలో మంచి ఫలితాలు రాబట్టాలని ఆమె సూచించారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. టేబుల్ టెన్నిస్ సామగ్రిని కొన్ని పాఠశాలల్లో నిరుపయోగంగా ఉంచారని, కొన్ని పాఠశాలల్లో లంచ్ టేబులుగా వాడటమేంటని ఆమె ప్రశ్నించారు. జిల్లా పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపడాలని, మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఇస్తున్న సబ్సిడీ రుణాలు అర్హులకు అందేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు 3వ వైర్ ఏర్పాటు చేయలేదని, వెంటనే వేయాల్సిందిగా సూచించారు. డీడీలు చెల్లించిన రైతులకు వెంటనే ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలన్నారు. సాధారణ నిధులు తప్ప మిగతా గ్రాంటు కింద కొత్త పనులు మంజూరు చేస్తామని చైర్పర్సన్ తెలిపారు.
జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ అధ్యక్షతన వ్యవసాయంపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరానికి వికారాబాద్ జిల్లా సమీపంలో ఉన్నందున కూరగాయల సాగు, చేపల పెంపకం, పాల ఉత్పత్తిపై రైతులను చైతన్యం చేయాలని సూచించారు. ఆలుగడ్డ సాగుపై సైతం రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులకు చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్ తోటల పెంపకంపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారని, వారిని ప్రోత్సహించాలని చెప్పారు.
మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమంపై స్థాయి సంఘం చైర్పర్సన్ సుజాత, చౌహాన్ అరుణ అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి జిల్లా పరిధిలోని 18 మండలాలకు రూ.3.47కోట్లకు సంబంధించిన ప్రొసీడింగ్‌లు జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఆయా మండలాల జడ్పీటీసీలకు అందజేశారు. ఎలాంటి తారతమ్యం లేకుండా జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డిప్యూటీ సీఈవో సుభాషిణి, జడ్పీటీసీలు నాగారెడ్డి, హరిప్రియ, సంధ్యారాణి, మేఘమాల, సంతోష, మహిపాల్, మధుకర్, శ్రీనివాస్‌రెడ్డి, రాందాస్‌నాయక్, జయమ్మ, మంజుల, పలు శాఖల జిల్లాస్థాయి అధికారులున్నారు.