పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల సంరక్షణపై వికారాబాద్ జిల్లా డీపీఆర్సీ కేంద్రంలో ఆమె నేతృత్వంలో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్ముందు మళ్లీ పోడు భూముల సమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. అర్హులందరికీ న్యాయం చేసే దిశగా సీఎం కేసీఆర్ చొరవ తీసుకుంటున్నారన్నారు. అటవీ హక్కుల చట్టం అమలులోకి వచ్చిన తర్వాత జిల్లాలో 672 మందికి 1131 ఎకరాలకు సంబంధించిన హక్కు పత్రాలు అందజేసినట్లు తెలిపారు. పాత రికార్డుల ప్రకారం జిల్లాలో 2,449 ఎకరాల్లో పోడు భూములు సాగు చేస్తున్నట్లు ఉందని, ఈ విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. నవంబర్ 8వ తేదీన పోడు భూములపై దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు. అలాగే తాండూరు నియోజకవర్గంలో రూ.26.42 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కలెక్టర్ నిఖిల, స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో కలిసి మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు.
పరిగి, అక్టోబర్ 30 : పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్ ప్రధాన సంకల్పమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే ఒక కమిటీ వేసి, దాని ప్రతిపాదనలు ఆమోదించుకొని ముందు వెళ్లాలని ఆలోచన చేశారన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల సంరక్షణపై వికారాబాద్ జిల్లా డీపీఆర్సీ కేంద్రంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో మళ్లీ పోడు భూముల సమస్యలు ఉత్పన్నం కాకుండా, పోడు చేసుకుంటున్న అర్హులందరికీ న్యాయం చేస్తూ పట్టాలిచ్చి, ఆ భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చుతారన్నారు. అడవిని సంరక్షించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని అన్నారు.
672 మందికి 1131 ఎకరాలకు సంబంధించిన హక్కు పత్రాలు అందజేత
లక్షా8వేల ఎకరాల అటవీ వైశాల్యం ఉన్న జిల్లా వికారాబాద్ అని మంత్రి తెలిపారు. 2006లో అటవీ హక్కుల చట్టం అమలులోకి వచ్చిందని చెప్పారు. ఈ చట్టం వచ్చిన తర్వాత జిల్లాలో 672 మందికి 1131 ఎకరాలకు సంబంధించిన హక్కు పత్రాలు అందజేశారని పేర్కొన్నారు. 2,449 ఎకరాల్లో పోడు భూములు సాగు చేసుకున్నట్లు రికార్డులో ఉందని, ఇది పాతదని, ఇంకా విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు మంత్రి చెప్పారు. నవంబర్ 8న పోడు భూములపై దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 68లక్షల ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారని ఆమె పేర్కొన్నారు. 2006 సంవత్సరానికి ముందు 6లక్షల ఎకరాలకు పైగా అటవీ భూమి సాగులో ఉందని, కొత్తగా పోడు ఆపాలని సీఎం కేసీఆర్ కొత్త క్లెయిమ్స్ తీసుకోవడం అపారమని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే పోడు చేసుకుంటున్న వారికి అన్యాయం జరగొద్దు అనేది ప్రభుత్వ ఆలోచన అని ఆమె తెలిపారు. ఇకపై ఇంచు భూమి కూడా పోడు కాకుండా చూడాలని, అడవిని రక్షించాలని సీఎం కేసీఆర్ ఆలోచించారని చెప్పారు. హరిత తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా హరితహారం ద్వారా ఇన్ని మొక్కలు నాటలేదన్నారు. తెలంగాణ సరిహద్దు రాష్ర్టాలు కర్నాటక, మహారాష్ట్రల నుంచి మన ప్రాంతంలోకి రాగానే చెట్లను చూడగానే తెలంగాణ అని తెలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఆర్వోఎఫ్ఆర్ ద్వారా అర్హులందరికీ పట్టాలు
ఆర్వోఎఫ్ఆర్ ద్వారా అర్హులందరికీ పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు. పేదలకు మేలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని, జిల్లాలో అటవీ ఇబ్బందులను అధిగమించి సమస్యల పరిష్కారానికి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని చెప్పారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల నియామకం తర్వాత మళ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామని, అర్హులందరికీ న్యాయం చేద్దామని అన్నారు. ప్రతి ఆవాసానికి ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని, గ్రామసభ ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేస్తుందన్నారు. 2005 నుంచి నేటి వరకు శాటిలైట్ మ్యాప్స్ తమ వద్ద ఉన్నాయని, చట్టబద్ద అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ హక్కు పత్రం వస్తుందన్నారు. సర్వే జరిగే సమయంలో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, పార్టీల నేతలు దగ్గరుండి పరిశీలించాల్సిందిగా మంత్రి సూచించారు. ఇంతకుముందు వేసిన రోడ్లకు ఇబ్బందులు పెట్టవద్దని సీఎం చెప్పారన్నారు. సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తే భవిష్యతులో సమస్యలు రావని, కొత్తగా ఎవరూ కబ్జాకు ప్రయత్నం చేయకుండా చూడాలన్నారు. అఖిలపక్షంలో వచ్చిన సలహాలు, సూచనలను స్వీకరిస్తూ పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, పి.నరేందర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి, కలెక్టర్ నిఖిల, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.