ఉపాధిహామీ పథకం అమలులో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానం దక్కించుకున్నది. ఉపాధి పనుల్లో పురోగతి ఆధారంగా రాష్ట్రస్థాయిలో జిల్లాలకు స్థానాలు కేటాయిస్తారు. లేబర్ బడ్జెట్, 5 రోజులు, 7 రోజుల లోపు పే ఆర్డర్, వంద పనిదినాలు కల్పించిన కుటుంబాల సంఖ్య ఆధారంగా వచ్చిన సరాసరి మార్కులను బట్టి స్థానాలను నిర్ణయిస్తారు. కాగా, గత ఏప్రిల్ నెల నుంచి వికారాబాద్ జిల్లా టాప్‌లో కొనసాగుతూ సత్తా చాటుతున్నది. ఆరు అంశాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన జిల్లా 69.49శాతం వెయిటేజ్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ఇక మండలాల జాబితాలో జిల్లా పరిధిలోని కోట్‌పల్లి రాష్ట్ర స్థాయిలో నెం.1 స్థానంలో మెరిసింది. ఈ మండలంలో అక్టోబర్ వరకు 2.94లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా.. 3.89లక్షల పనిదినాలు కల్పించారు. అంతేకాకుండా ఇప్పటివరకు 875 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించిన మండలంగా మొదటి స్థానంలో ఉన్నది. అలాగే టాప్ టెన్‌లో బంట్వారం, మర్పల్లి, వికారాబాద్, పెద్దేముల్ మండలాలకు చోటు లభించింది. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 1,05,903 కుటుంబాలకు పని కల్పించగా.. రూ.115.8కోట్ల కూలి డబ్బులు చెల్లించారు.
పరిగి, అక్టోబర్ 30 : ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి వికారాబాద్ జిల్లా రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఒకటి రెండు నెలలు అని కాకుండా గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు వికారాబాద్ జిల్లా ఉపాధిహామీ పనుల్లో టాప్‌లో నిలువడం గమనార్హం. పలు అంశాల్లో చేపట్టిన పురోగతికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికపుడు జిల్లాలకు స్థానాలు కేటాయిస్తారు. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలను వెనక్కి నెట్టి వికారాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలువగా ములుగు జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. వికారాబాద్ జిల్లాకు సంబంధించి 6 అంశాలలో రాష్ట్రస్థాయిలోనే టాప్‌లో నిలిచిందని గ్రామీణాభివృద్ధి అధికారులు తెలిపారు. దీంతోపాటు జిల్లా పరిధిలోని కోట్‌పల్లి మండలం సైతం మండలాల జాబితాలో రాష్ట్రస్థాయిలో నం.1 స్థానంలో నిలవగా టాప్ టెన్ మండలాల్లో జిల్లా నుంచి 5 మండలాలకు చోటు లభించడం గమనార్హం.
6 అంశాల్లో రాష్ట్రంలో అగ్రస్థానం
వికారాబాద్ జిల్లా ఉపాధి హామీ పనులకు సంబంధించి 69.49శాతం వెయిటేజ్‌తో రాష్ట్రంలోనే నం.1గా నిలిచింది. ఇందులోను ప్రధానంగా 6 అంశాల్లో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. లేబర్ బడ్జెట్‌కు సంబంధించి జిల్లాలో 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు 1.04 కోట్లు పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా ఉన్నది. ఇందులో అక్టోబర్ వరకు 77.96 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా 60.13లక్షల(77.13శాతం) పనిదినాలు కల్పించారు. పని చేసిన తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్లు అయిదు రోజుల లోపు పే ఆర్డర్ జనరేట్ చేయడంలో 97 శాతం, 7 రోజులలోపు ఎంపీడీవో ఆన్లైన్లో అప్లోడ్ చేసే వరకు 98.31 శాతం పనులు జిల్లాలో పూర్తయ్యాయి. అలాగే వికారాబాద్ జిల్లావ్యాప్తంగా పనికి వచ్చే కుటుంబాల సంఖ్య 1,31,427 ఉండగా 1,05,903 కుటుంబాలకు ఇప్పటివరకు పని కల్పించారు. జిల్లాలో 12,582 కుటుంబాలకు వంద రోజులు పని కల్పించారు. దీంతోపాటు జిల్లాలో సరాసరి పని కల్పించిన కుటుంబాల సంఖ్య 56.78 శాతం ఉన్నది. ఈ ఆరు అంశాల్లో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో నిలువడంతో ఉపాధి హామీలో నం.1 స్థానాన్ని కైవసం చేసుకోవడంతోపాటు ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు అదే స్థానం పదిలపరుచుకుంటూ వస్తున్నది. ఇదిలావుండగా జిల్లా పరిధిలో ఇప్పటివరకు కూలీలకు రూ.115.8 కోట్లు చెల్లించారు.
టాప్ టెన్‌లో 5 మండలాలు
ఉపాధి హామీ పనులకు సంబంధించి జిల్లా పరిధిలోని కోట్‌పల్లి మండలం రాష్ట్రంలోనే నం.1 స్థానంలో నిలిచింది. దీంతోపాటు రాష్ట్రంలోని టాప్ టెన్ మండలాల్లో వికారాబాద్ జిల్లాకు చెందిన 5 మండలాలకు చోటు దక్కడం గమనార్హం. కోట్‌పల్లి మండలంలో కూలీలకు అక్టోబర్ వరకు 2.94 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా ఇప్పటివరకు 3.89 లక్షల పనిదినాలు కల్పించి అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 875 కుటుంబాలకు వంద రోజులు కల్పించిన మండలంగా మొదటి స్థానంలో ఉన్నది. 5 రోజుల్లోపు పే ఆర్డర్ జనరేట్‌కు సంబంధించి 6,477 పే ఆర్డర్లు జనరేట్ చేయాల్సి ఉండగా 6,473 (99.94శాతం) పే ఆర్డర్లు జనరేట్ చేశారు. 7 రోజుల్లోపు పే ఆర్డర్ జనరేట్‌కు సంబంధించి 12,530 పే ఆర్డర్లు జనరేట్ చేయాల్సి ఉండగా 12,526 (99.97శాతం) పే ఆర్డర్లు జనరేట్ చేశారు. కూలీలకు రోజుకు రూ.245 చెల్లించాల్సి ఉండగా రాష్ట్రంలోనే అత్యధికంగా రోజు కూలీ రూ.218 చెల్లించడంతో 5 అంశాల్లో కోట్‌పల్లి మండలం మొదటి స్థానంలో నిలిచింది. కోట్‌పల్లి మండలం సరాసరి 81.47 శాతంతో రాష్ట్రంలో నం.1 స్థానం దక్కించుకుంది. ఇదిలావుండగా ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రస్థాయిలో జిల్లాలోని బంట్వారం మండలం 4, మర్పల్లి మండలం 6, వికారాబాద్ మండలం 8, పెద్దేముల్ మండలం 10వ స్థానంలో నిలిచాయి. మండలాలకు, జిల్లాకు సంబంధించి ఉపాధి హామీ పనుల్లో లేబర్ బడ్జెట్, 5 రోజులు, 7 రోజుల లోపు పే ఆర్డర్, 100 పనిదినాలు కల్పించిన కుటుంబాల సంఖ్య ఆధారంగా సరాసరి మార్కులు నిర్ణయించడంతో ఈ స్థానాలు దక్కాయి.
కూలీ నుంచి రైతుగా మారడానికి సహకారం
ఉపాధి హామీ కూలీ నుంచి రైతుగా మారడానికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి జరుగుతుంది. కూలీలకు పని కల్పించడంతోపాటు జీవనోపాధి మెరుగుపరచడం కోసం కూరగాయలు, పండ్ల తోటల సాగు, ఇతర కార్యక్రమాల అమలు ప్రణాళికాబద్దంగా జరుగనుంది. ఇందుకు ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందుతున్నది. ఉపాధి హామీ లక్ష్య సాధనలో పూర్తిస్థాయిలో కృషి చేయడం ద్వారా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.