మోమిన్‌పేట, అక్టోబర్ 29 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం గ్రామ పంచాయతీల్లో సమస్యలు పరిష్కరించి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. బాల్రెడ్డిగూడ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంక్ ఏర్పాటు చేసి ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నారు.
ఆహ్లాదకరంగా పల్లెప్రకృతి వనం
ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి మామిడి, జామ, దానిమ్మ, నీలగిరి, నేరేడు, డిజైన్ మొక్కలు, పూలు, ఔషధ మొక్కలు నాటారు. వాటికి ప్రతి రోజూ నీరు పోస్తూ సంరక్షిస్తున్నారు. దీంతో ఆహ్లాదకరంగా మారి ప్రజలకు మంచి వాతావరణాన్ని అందిస్తున్నది.
గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తి
పల్లెప్రగతి ద్వారా ఏర్పాటు చేసిన వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, నర్సరీ పనులు పూర్తయ్యాయి. ప్రతి రోజూ గ్రామంలో పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తూ గ్రామాన్ని పరిశుభ్రం చేస్తున్నారు. రూ.7 లక్షల నిధులతో నూతనంగా సీసీ రోడ్డు నిర్మించారు.
ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలుగ్రామాన్ని స్వచ్ఛతగా ఉంచేందుకు ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలను ప్రజలు నిర్మించుకోవడంతో పాటు వాటిని ఉపయోగిస్తున్నారు.
గ్రామాల రూపురేఖలు మారాయి
పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ప్రకృతివనం, రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. ప్రతి రోజూ పారిశుద్ధ్య పనులతో గ్రామం పరిశుభ్రంగా మారుతున్నది.
పరిసరాల పరిశుభ్రతకు చర్యలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలని పల్లెప్రగతి కార్యక్రమానికి చేపట్టారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశాం. ప్రతి రోజూ గ్రామంలోని పంచాయతీ ట్రాక్టర్‌తో చెత్తను సేకరిస్తున్నాం. మురుగు కాలువల శుభ్రం చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రం చేసుకుంటూ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాం.
అభివృద్ధి పనులు భేష్
సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పల్లె ప్రగతితో గ్రామం శుభ్రంగా మారింది. ఇంటింటికీ తాగునీరు అందిస్తూ గ్రామంలో నీటి కొరత తీరుస్తున్నారు. సర్పంచ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామంలో పనులు చేస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.