తాండూరురూరల్, అక్టోబరు 28 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయి. తాండూరు మండలం, చెన్‌గేష్‌పూర్ (కోనాపూర్) గ్రామం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. రెండేండ్ల కాలంలో రూ.74 లక్షలతో అభివృద్ధి పనులు జరిగాయి. రూ.28లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేశారు. రూ.16 లక్షల వ్యయంతో గ్రామ పంచాయతీ భవనం, రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.1.50 లక్షలతో డంపింగ్ యార్డు పూర్తి చేశారు. అదేవిధంగా రూ.10 లక్షలతో చెన్‌గేష్‌పూర్, కోనాపూర్ గ్రామాల్లో మురుగు కాలువల పనులు పూర్తి చేశారు. రూ. 2లక్షల వ్యయంతో వైకుంఠధామానికి ఫార్మేషన్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రూ.3 లక్షల వ్యయంతో కంపోస్టు షెడ్ నిర్మాణ పనులు చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లు, పొలం, చెరువులు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించేందుకు పంచాయతీ ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసి ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తున్నారు. ఇంటింటికీ చెత్త బుట్టలు కూడా పంపిణీ చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలిస్తారు.
ఆహ్లాదకరంగా పల్లెప్రకృతి వనం
గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. పండ్లు, పూల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు నాటారు. వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఓ తోటమాలిని కూడా ఏర్పాటు చేశారు.
ఇంటింటికీ తాగునీటి సౌకర్యం
గ్రామంలో అన్ని వార్డుల్లో మిషన్ భగీరథ నీరు అందేలా పక్కా ప్రణాళికతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. ప్రతి వీధిలో ఎల్ఈడీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.
అన్ని సౌకర్యాలతో వైకుంఠధామం
గ్రామంలో అన్ని సౌకర్యాలతో వైకుంఠధామం ఏర్పాటు చేశారు. రోడ్డు సౌకర్యం కోసం రూ.2 లక్షలు వెచ్చించి ఫార్మేషన్ రోడ్డు నిర్మించారు. వైకుంఠధామంలో స్నానపు గదులు, వెయిటింగ్ హాల్, నీటి సౌకర్యం ఏర్పాట్లు చేశారు.
రూ.20లక్షలతో సీసీ రోడ్లు
గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం. రెండేండ్ల కాలంలో ప్రతి వీధిలో సీసీ రోడ్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. రూ.10 లక్షల వ్యయంతో మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టారు.
బస్టాండ్ నిర్మాణాలు
చెన్‌గేష్‌పూర్ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉన్న కోనాపూర్‌లో కూడా పలు అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ఈ రెండు గ్రామాల్లో బస్ షెల్టర్లు పూర్తి చేశారు.
గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లెప్రగతి కార్యక్రమాన్ని గ్రామంలో విజయవంతంగా కొనసాగిస్తున్నాం. చెన్‌గేష్‌పూర్, కోనాపూర్ గ్రామాల ప్రజల సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశాం. వైకుంఠధామం, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్లు, మురుగు కాలువల పనులు పూర్తి చేశాం. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం.
గ్రామ రూపు రేఖలు మారాయి
ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామ రూపురేఖలు మారాయి. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు ఇస్తున్నాం. పల్లె ప్రకృతి వనంలో విరివిగా మొక్కలు నాటాం. డంపింగ్ యార్డు పనులు పూర్తి చేశాం. మిగిలిన చిన్నచిన్న పనులు కూడా పూర్తి చేస్తాం.
సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో వేగంగా గ్రామాభివృద్ధి జరుగుతున్నది. ఏ ప్రభుత్వాలూ చేయని పనులు సీఎం కేసీఆర్ చేస్తున్నారు. ఊరు ఎంతో మారింది. నిత్యం ఇంటింటికీ చెత్త సేకరణతో గ్రామంలో పరిశుభ్రత వాతావరణం ఏర్పడింది. ప్రజల సంపూర్ణ సహకారంతో గ్రామం అభివృద్ధి వైపు సాగుతోంది.