కడ్తాల్, అక్టోబర్ 27: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు పర్యావరణంపై అందరూ అవగాహన పెంపొందించుకోవాలని ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి అన్నారు. బుధవారం అన్మాస్‌పల్లి గ్రామంలోని ఎర్త్ సెంటర్లో, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై ప్రజా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్యావరణవేత్తలు పురుషోత్తంరెడ్డి, తులసీరావు, సమాచార మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపకులు లీల, ఎర్త్ సెంటర్ డైరెక్టర్ సాయిభాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ మార్పులపై ప్రజా సమీక్ష సమావేశాలు ఈ నెల అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో స్కాట్లాండ్ దేశంలోని గ్లాస్కో నగరంలో జరుగనున్నాయని, ఆ సమావేశాలకు సమాంతరంగా అన్మాస్పల్లిలోని ఎర్త్ సెంటర్లో 13 రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తారన్నారు. గ్లాస్కో నగరంలో నిర్వహించే సదస్సులో చర్చలను పరిశీలిస్తూ, సమీక్ష సమావేశాల్లో తీసుకొనే నిర్ణయాలను సేకరించి, ఎర్త్ సెంటర్లో పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, మహిళలు, రైతులతో ఆయా అంశాలపై సమీక్షించనున్నట్లు చెప్పారు. ఈ నెల 31న బాలలు, విద్యా, వాతావరణ మార్పులు, నవంబర్ 1న యువత, వాతావరణ మార్పులు, 2న వాతావరణ భద్రతకు స్థానిక సంస్థల బాధ్యత, 3న వ్యవసాయరంగం, జలవనరులు, వాతావరణ మార్పులు, 4న వాతావరణ భద్రతకు న్యాయవ్యవస్థ బాధ్యత, 5న ప్రజా సంస్థల బాధ్యత, 6న వాతావరణ మార్పులు, ప్రజారోగ్యం, ఆధ్యాత్మిక జాగృతి, 7న పరిశ్రమలు, విద్యుత్, వాతావరణ మార్పులు, 8న వాతావరణ మార్పులు, పత్రిక, సామాజిక మాధ్యమ బాధ్యత, 9న మహిళలు, వాతావరణ మార్పులు, 10న జీవవైవిధ్యం, పర్యావరణ మార్పులు, 12న మానవ ఆవాసాలు, పట్టణీకరణ, వాతావరణ మార్పులు, 13న వాతావరణ మార్పుల నిరోధానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ మార్గాలపై సదస్సులు జరుగుతాయన్నారు. సీజీఆర్ వ్యవస్థాపకురాలు లీల మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు సీజీఆర్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ర్టాల్లో 11 ఏండ్లల్లో 10 లక్షల మంది విద్యార్థుల భాగస్వామ్యంతో 34 లక్షల మొక్కలను నాటామన్నారు.