పరిగి/షాబాద్, అక్టోబర్ 27 : స్పెషల్ సమ్మరీ రివిజన్-2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న అన్ని జిల్లాల్లో విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఎస్.ఎస్.ఆర్-2022పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 30 వరకు వచ్చిన ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు తదితర దరఖాస్తులను పరిష్కరించి నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలని సూచించారు. ముసాయిదా కాపీలను అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని, ఓటర్లకు ఓటరు జాబితాలో ఏమైనా పేర్లలో మార్పులు, ఫొటో లేకపోవడం తదితర సమస్యలు ఉంటే దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 2 నుంచి సరిచేసే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ఓటర్ల అభ్యంతరాలను పరిష్కరించి 2022 జనవరి 5న ఓటరు తుది జాబితాను ప్రచురించాలని సూచించారు. జనవరి 1, 2022 నాటికి 18 ఏండ్లు నిండిన యువత ఆన్లైన్ ద్వారాగాని, ఫారం-6 ద్వారాగాని ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసేలా ప్రచారం గావించాల్సిందిగా తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వివరాలు, ఓటర్ల మార్పు చేర్పులు చేసుకోవడానికి గరుడ యాప్ ఉపయోగపడుతుందని.. ఈ యాప్ ఎలా ఉపయోగించాలో బూత్ లెవల్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ఓటరు ఇండ్లు మారడం వల్ల పోలింగ్ స్టేషన్లు అదనంగా అవసరం ఉంటే లేదా పోలింగ్ కేంద్రం వేరే చోటికి మార్చవలసి ఉన్న ప్రాంతాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి ఆమోదంతో తగు మార్పులకు సిఫారసు చేయవచ్చన్నారు. ఈవీఎంల భద్రతపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిల్లాల్లో స్వీప్ యాక్టివిటీ నిర్వహించి ఓటర్లను చైతన్యవంతులను చేయాలని పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ద్వారా ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తామని, జిల్లాలో ఓటరు నమోదు, పేర్ల మార్పునకు వచ్చిన దరఖాస్తులు అన్ని పరిష్కరించి నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్ మోతీలాల్, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా డీఆర్వో హరిప్రియ, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, డీపీవో శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.