ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల నిర్వహణకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నేటి నుంచి నవంబర్ 3వ తేదీ వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. రంగారెడ్డిజిల్లాలో మొత్తం 195 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 56,241 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వికారాబాద్ జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 9,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కొవిడ్ నిబంధనలతో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
పరిగి/షాబాద్, అక్టోబర్ 24 : సెకండ్ ఇయర్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. వికారాబాద్ జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 9,239 మంది విద్యార్థులు, రంగారెడ్డి జిల్లాలో 195 కేంద్రాల్లో 56,241 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవనున్నారు. పరీక్షలు నవంబర్ 2 వరకు కొనసాగుతాయి. ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, 15 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
కొవిడ్ నిబంధనలకు లోబడి..
కొవిడ్ నిబంధనలకు లోబడి ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించి పరీక్షకు హాజరవ్వాలి. పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేకంగా థర్మల్ స్క్రీనింగ్‌తోపాటు శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గదిని శానిటైజ్ చేయించారు. పరీక్ష జరిగిన తర్వాత గదులను శానిటైజ్ చేయించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జ్వరం లక్షణాలున్న వారికి ప్రత్యేక కేటాయించాలని విద్యాశాఖ సూచించింది. మెడికల్ సిబ్బంది, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయి. మౌలిక సదుపాయాల కల్పన, విద్యుత్ సరఫరాలో అంతరాయం, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. పరీక్షా కేంద్రాల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు, 144 సెక్షన్ అమలుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేస్తారు. ప్రతీ జిల్లాలో ఒక ఫ్లయింగ్ స్కాడ్, ఒక డెక్ స్కాడ్, రెండు సిట్టింగ్ స్కాడ్లను ఏర్పాటు చేశారు. పరీక్షా సమయానికి అనుగుణంగా వివిధ గ్రామాల నుంచి టీఎస్ ఆర్టీసీ వారు బస్సులు నడిపిస్తారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఆయా శాఖల అధికారులు పూర్తి చేశారు.
అన్ని ఏర్పాట్లు చేపట్టాం : ఎన్.శంకర్, నోడల్ ఆఫీసర్, వికారాబాద్ జిల్లా
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలో 29 కేంద్రాల్లో పరీక్షల నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబడదు. మాస్కులు తప్పనిసరిగా ధరించి పరీక్షలకు హాజరుకావాలి.