e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, November 30, 2021
Home News గంజాయిపై యుద్ధమే

గంజాయిపై యుద్ధమే

  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు
  • వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు
  • గంజాయి సాగు, నిల్వ, రవాణా, విక్రయంపై నిఘా..
  • పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యంగా ముందుకు
  • చెక్‌పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీలు చేస్తున్న పోలీసులు

గంజాయి నివారణకు ప్రభుత్వం యుద్ధం ప్రకటించగా.. అధికారులు సైనికులుగా మారి రంగంలోకి దిగారు. గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మత్తు పదార్థాల నివారణ లక్ష్యంగా వికారాబాద్‌ జిల్లాను జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా గంజాయి సాగు, నిల్వలు, రవాణా, విక్రయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా పంటపొలాలు, అనుమానిత భవనాలు, వాహనాలు, దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు. పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను పరిశీలిస్తున్నారు. జిల్లా ఎస్పీ నారాయణ ఆదేశం మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా పాన్‌ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. కాగా జిల్లాలో ఇటీవల గంజాయికి సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి.

పరిగి, అక్టోబర్‌ 23 : వికారాబాద్‌ జిల్లా పరిధిలో గంజాయిని అరికట్టడానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఇటీవల సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ నారాయణ ఆదేశాలతో జిల్లాలోని పోలీసులు శనివారం నుంచే ఈ కార్యాచరణకు దిగారు. జిల్లాలో ఇటీవల గంజాయికి సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో పూర్తిస్థాయిలో గంజాయిని అరికట్టడానికి పోలీసు యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. గంజాయి సాగు, నిలువ చేసి విక్రయించే ప్రాంతాలు, రవాణా, వినియోగించే వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ద్వారా జిల్లాలో గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటీవల వికారాబాద్‌ జిల్లా పరిధిలో మూడు గంజాయి కేసులు నమోదయ్యాయి. కొడంగల్‌ మండలం లక్ష్మీపల్లి, మర్పల్లి మండలం తుమ్మలపల్లిలోని పొలంలో సాగు చేసిన గంజాయి మొక్కలు, బంట్వారం మండలం రొంపల్లిలో గంజాయి పొడి పట్టుబడ్డాయి. ఈ మేరకు కేసులు నమోదు చేశారు.

- Advertisement -

నాలుగు అంశాలపై ప్రత్యేక దృష్టి

గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పోలీసులు నాలుగు అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. గంజాయి సాగు ఏ ప్రాంతాల్లో జరుగుతున్నది, పూర్తిస్థాయిలో సమాచార సేకరణకు నడుం బిగించారు. ఎప్పటి నుంచి ఈ సాగు కొనసాగుతుందనే అంశంపై ప్రతి గ్రామం వారీగా సమాచారం సేకరిస్తున్నారు. నిలువకు సంబంధించి జిల్లాలో ఏ ప్రాంతాల్లో గంజాయి స్టాకు పెట్టి విక్రయాలు చేస్తున్నారు అనేది సైతం ఇందులో ప్రధానమైంది. జిల్లా పరిధిలోని ప్రతి గ్రామం, పట్టణాల్లో ఎక్కడ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్నది ఆరా తీస్తున్నారు. పాన్‌షాప్‌లు, ఇతర దుకాణాల్లో గంజాయి విక్రయాలపై ఆరా తీస్తున్నారు. గంజాయి రవాణా ఎలా జరుగుతుంది అనే అంశంపై సైతం దృష్టి కేంద్రీకరించారు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి రవాణా జరుగుతుందా, జిల్లాలోని ఏఏ ప్రాంతాలకు రవాణా అవుతున్నదనే అంశాలపై నిఘా పెంచారు. మరోవైపు నిత్యం గంజాయి వినియోగించే వారి సమాచారం రాబడుతున్నారు. జిల్లా పరిధిలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక సమాచార వ్యవస్థ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. ఎక్సైజ్‌ వారు సైతం గంజాయి అంశంపై మరింత ప్రణాళికాబద్ధంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. వికారాబాద్‌ జిల్లాకు ఆనుకొని కర్ణాటక రాష్ట్రం ఉంటుంది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి గంజాయి రవాణా జరుగకుండా చెక్‌పోస్టుల్లో మరింత పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. రావులపల్లి వద్ద ఒక చెక్‌పోస్టు ఉండగా తాండూరు మండలం కొత్లాపూర్‌ వద్ద సైతం మరో చెక్‌పోస్టు ఏర్పాటుకు ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. గంజాయిని అరికట్టడంపై పోలీసులు, ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారులు, ఇతర శాఖల అధికారులు సైతం సమన్వయంతో పనిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

జిల్లా అంతటా ఒకేరోజు తనిఖీలు

గంజాయి విక్రయాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో వికారాబాద్‌ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో పోలీసులు శనివారం ఒకేరోజు తనిఖీలు చేపట్టారు. గంజాయి విక్రయాలు ఎక్కడెక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయనే అంశాలపై దృష్టి కేంద్రీకరించిన పోలీసులు జిల్లా వ్యాప్తంగా పాన్‌షాప్‌లు, పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి తనిఖీలు ప్రారంభించారు. ప్రతి గ్రామంలో సంబంధిత పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌, హోంగార్డులు పాల్గొన్నారు. పలుచోట్ల డీఎస్పీ, సీఐలు సైతం ఈ తనిఖీలు చేపట్టారు. ఒకేసారి తనిఖీలతో గంజాయి విక్రయాలపై తెలియడంతోపాటు భవిష్యత్‌లో విక్రయించకుండా ఈ చర్యలు ఉపకరిస్తాయని అభిప్రాయపడుతున్నారు.

6 షాపుల్లో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

మోమిన్‌పేట, అక్టోబర్‌ 23 : గుట్కాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మోమిన్‌పేట సీఐ వెంకటేశం అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పాన్‌ షాప్‌లల్లో తనిఖీలు నిర్వహించారు. 6 షాపులో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

వికారాబాద్‌లో 10 షాపులపై కేసులు

వికారాబాద్‌, అక్టోబర్‌ 23 : పట్టణంలోని పాన్‌షాపుల్లో వికారాబాద్‌ పోలీసులు తనిఖీలు చేశారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లు, తదితర మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 పాన్‌షాపులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ రాజశేఖర్‌ తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement