
నీటి వసతి కోసం బోరు మంజూరు
వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు
పాతూరులో వివిధ పనుల పరిశీలన
ప్రకృతివనంలో మొక్కలు బాగున్నాయని అభినందించిన కలెక్టర్
వికారాబాద్ , ఆగస్టు 21 : గ్రామంలోని ప్రైవేటు స్థలంలో నిర్వహిస్తున్న నర్సరీని ప్రకృతివనంలోకి మార్చాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని పాతూర్ గ్రామాన్ని సందర్శించి పల్లె ప్రకృతివనం, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం నిర్మాణ పనులు, పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. ఎకరం స్థలంలోని పల్లె ప్రకృతివనంలో మొక్కలు బాగున్నాయని అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నర్సరీని ప్రకృతి వనంలోకి మార్చడానికి అవసరమైన నీటి సదుపాయం కోసం బోరు మంజూరు చేసినట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని సర్పంచ్, కార్యదర్శులకు సూచించారు. డంపింగ్‌యార్డుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలోని వీధులతో పాటు ఇంటింటా తిరిగి శుభ్రతపై ప్రజలకు వివరించారు. నిరుపయోగంగా ఉన్న వస్తువుల్లో వర్షపు నీరు నిల్వకుండా చూడాలని తెలిపారు. పరిసరాలను ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకొని మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. గ్రామంలో 30 సంవత్సరాలు పైబడిన వారిని గుర్తించి మధుమేహం, ఇతర పరీక్షలు చేసి వారికి వైద్య సేవలు అందేటట్లు చూడాలని ఆశావర్కర్లను ఆదేశించారు. ఉపాధి హామీ కూలీల (జాబ్‌కార్డు హోల్డర్స్) రిజిస్టర్‌ను, గ్రామ సభలు నిర్వహించే రిజిస్టర్లను పరిశీలించారు. దారిలో వెళ్తుండగా హనుమంత్‌రెడ్డి అనే యువ రైతును కలెక్టర్ పలకరించి ఈ సారి ఏ పంట వేస్తున్నావని అడుగగా అతడు స్పందిస్తూ ‘తన 5ఎకరాల్లో పొలంలో వాము పంట వేశాను. ఇంతకు ముందు పత్తి పంట వేస్తుంటిని, పంట మార్పిడి చేయడం వల్ల అధిక లాభాలు వస్తున్నాయని కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కృష్ణన్, ఎంపీడీవో సుభాషిణి, సర్పంచ్ లలితమ్మ, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, గ్రామ కార్యదర్శి సుహాసిని, ఏపీఎం సురేశ్ పాల్గొన్నారు.