పరిగి, నవంబర్ 17: స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్‌లోని స్త్రీశక్తి భవన్లో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ నిఖిల సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని ఐదు ఎక్సైజ్ స్టేషన్ల వారీగా వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ దరఖాస్తుదారులతో మాట్లాడుతూ ఏవైనా సమస్యలు, బ్యాంకర్లు డీడీలు జారీ చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. ఎలాంటి ఇబ్బందులు లేవని వారు తెలిపారు. జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్ కింద కేటాయించిన 9 మద్యం దుకాణాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. గురువారం సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తున్నందున ఎలాంటి సమస్యలు లేకుండా దరఖాస్తులు స్వీకరణ చేపట్టాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు సూచించారు. ఈనెల 20వ తేదీ శనివారం అంబేద్కర్ భవన్లో ఉదయం 11 గంటలకు డ్రాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పల్లవి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, ఎక్సైజ్ సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
మద్యం దుకాణాలకు 367 దరఖాస్తులు
పరిగి, నవంబర్ 17 : వికారాబాద్ జిల్లా పరిధిలో మద్యం దుకాణాలకు బుధవారం సాయంత్రం వరకు 367 దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ తెలిపారు. మంగళవారం వరకు 135 దరఖాస్తులు అందగా, బుధవారం ఒక్కరోజే 232 వచ్చాయి. ఈ సందర్భంగా తాండూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 108 దరఖాస్తులు, కొడంగల్ పరిధిలో 26, పరిగిలో 101, వికారాబాద్‌లో 110, మోమిన్‌పేట్ పరిధిలో 21 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు గురువారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉండడంతో చివరి రోజు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.