మహిళా సంఘాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తున్నది. స్వయం సహాయక సంఘాల లావాదేవీలు పారదర్శకంగా ఉండేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఎస్‌హెచ్‌జీ అకౌంటింగ్ యాప్‌ను రూపొందించింది. ప్రతి సభ్యురాలి పూర్తి వివరాలను యాప్‌లో నమోదు చేసి, లావాదేవీలన్నీ ఆన్లైన్లో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 16,182 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 7,558 సంఘాలు ఇప్పటికే ఆన్లైన్లో లావాదేవీలు చేస్తుండగా, ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి స్థాయిలో లావాదేవీలు కొనసాగేలా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నెలా రెండుసార్లు నిర్వహించే సమావేశాలతో పాటు తీర్మానాలనూ సైతం ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
పరిగి, అక్టోబర్ 31 : స్వయం సహాయక సంఘాల లావాదేవీలన్నీ ఇక ఆన్లైన్లోనే చేపట్టాలి. ఇందుకు సంబంధించి తయారుచేసిన ఎస్‌హెచ్‌జీ యాప్ ద్వారానే ఈ లావాదేవీల ప్రక్రియ కొనసాగుతుంది. గత నెలలో ఈ యాప్‌లో నమోదు ప్రక్రియ ప్రారంభించగా ఈ నెల నుంచి పూర్తిస్థాయిలో ఇదే విధానంలో లావాదేవీలు కొనసాగించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 16,182 స్వయం సహాయక సంఘాలున్నాయి. ప్రతి సంఘం సంబంధిత నెల 1 నుంచి 15 వరకు ఒక సమావేశం, 15 నుంచి నెలాఖరు లోపు మరో సమావేశం తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లా పరిధిలో 648 గ్రామ సహాయక సంఘాలుండగా 615 సంఘాలకు ట్యాబ్‌లు అందజేశారు. ప్రతి గ్రామానికి ఒక బుక్ కీపర్ ఉండగా, ఆన్లైన్ యాప్‌లో లావాదేవీల నమోదు కోసం ప్రతి 3 నుంచి 5 సంఘాలకు ఒకరు చొప్పున బుక్ కీపర్లను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. వారికి నవంబర్ 5లోగా శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. అలాగే జిల్లావ్యాప్తంగా నవంబర్ 15లోగా ఆన్లైన్లో లావాదేవీలు వంద శాతం జరిగేలా చూడాలని అధికారులు నిర్ణయించారు.
ఎస్‌హెచ్‌జీ అకౌంటింగ్ యాప్‌లో నమోదు
స్వయం సహాయక సంఘాల లావాదేవీలన్నీ ఆన్లైన్లో జరిపేలా ఎస్‌హెచ్‌జీ అకౌంటింగ్ యాప్ తయారు చేశారు. ఇందులో భాగంగా ప్రతి స్వయం సహాయక సంఘం సభ్యురాలి పేరు వివరాలు నమోదు చేయడం ద్వారా సభ్యురాలికి, సంఘానికి ఒక కోడ్ ఇస్తారు. ఇప్పటికే ఈ యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమవగా ఇప్పటివరకు 46.71శాతం సంఘాలు ఆన్లైన్ ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. నవంబర్ 15 వరకు జిల్లావ్యాప్తంగా 100శాతం సంఘాలు ఆన్లైన్లో లావాదేవీలు కొనసాగించేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు జిల్లా పరిధిలో దోమ మండలంలోనే అత్యధిక సంఘాలు ఆన్లైన్లో లావాదేవీలు కొనసాగిస్తూ మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా పరిధిలో 16,182 స్వయం సహాయక సంఘాలుండగా లక్షా62వేల పైగా సభ్యులున్నారు. ఈ సంఘాల సభ్యులు రూ.150కోట్లు పొదుపు చేశారు. ఈసారి రూ.365కోట్లు రుణాలివ్వాలని లక్ష్యం నిర్దేశించగా ఇప్పటివరకు రూ.198కోట్లు రుణాలుగా ఆయా సంఘాలకు అందజేశారు. జిల్లాలోని 16,182 సంఘాలకు సంబంధించి ఇప్పటివరకు 7,558 సంఘాలు ఎస్‌హెచ్‌జీ అకౌంటింగ్ యాప్ ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. మిగతా సంఘాలన్నీ నవంబర్ 15లోగా వంద శాతం ఆన్లైన్లో లావాదేవీలకు సంబంధించి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఆదేశించారు.
మరింత పారదర్శకత..
ఎస్‌హెచ్‌జీ అకౌంటింగ్ యాప్‌లో స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన సమావేశాల దగ్గర నుంచి అందులో రాసిన సమావేశ మినిట్స్ అన్నీ ఆన్లైన్లోనే నమోదు చేయాలి. ఈ సందర్భంగా ప్రతి సభ్యురాలికి, ప్రతి సంఘానికి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఆధారంగా సంబంధిత సంఘం సమావేశాన్ని అదే గ్రామంలో నమోదు చేస్తేనే ఆన్లైన్ స్వీకరిస్తుంది, ఇతర ప్రాంతాల నుంచి ఫీడ్ చేస్తే అసలు తీసుకోదు. ఈ యాప్ ద్వారా లావాదేవీల నమోదుతో సంబంధిత గ్రామంలోనే సంఘం సమావేశాలు జరుగడం తప్పనిసరిగా మారింది. సంఘంలోని సభ్యులు ఎంత పొదుపు చేశారు, ఎంత రుణం తీసుకున్నారు, ఎంత రుణం తిరిగి చెల్లించారు తదితర అన్ని వివరాలు ఈ యాప్‌లో నమోదు చేస్తారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే ఆన్లైన్లో ఈ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆయా సంఘాల బ్యాలెన్స్ షీట్ సైతం ఆన్లైన్లో ఎంత ఉన్నది, బుక్‌లలో రాసింది ఎంత ఉన్నది సరి చూసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో జరిగే లావాదేవీల ఆధారంగా ఆయా స్వయం సహాయక సంఘాలకు ర్యాంకులు ఇస్తారు. ఆన్లైన్లో వారు నమోదు చేసే వివరాల ఆధారంగా ఈ ర్యాంకులు వస్తాయి. ప్రతీ నెల రెండు పర్యాయాలు తూచ తప్పకుండా సమావేశాలు నిర్వహించడం, ప్రతి సమావేశానికి సంఘంలోని సభ్యులు పూర్తిస్థాయిలో హాజరవడం, సమావేశం నిర్ణయాలు ఆన్లైన్లో నమోదు చేయడం, సభ్యుల పొదుపు, సభ్యులు తీసుకున్న అప్పులు ప్రతీ నెల తిరిగి చెల్లింపు చేపట్టే అంశాల ఆధారంగా ఆయా సంఘాల పనితీరును బేరీజు వేస్తారు. దీంతో ప్రతి సంఘానికి సంబంధించిన సమాచారం ఆన్లైన్లో ఉండడం వల్ల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి వరకు ఆ సంఘం సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. స్వయం సహాయక సంఘాల తర్వాత గ్రామ సంఘాల పనితీరు బేరీజు వేసేందుకు ఆన్లైన్లో లావాదేవీలు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఆన్లైన్లో లావాదేవీలతో మరింత పారదర్శకత ఏర్పడుతుందని చెప్పవచ్చు.