బషీరాబాద్, నవంబర్ 10 : గిరిజనులకు రాజ్యాధికారం ఇస్తే వాళ్ల బతుకుల్లో వెలుగులు వస్తాయని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను పంచాయతీలుగా ప్రకటించారు. నిధులు కేటాయించడంతో తండాలు అభివృద్ధి బాట పట్టాయి. అనుబంధంగా ఉన్నప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న గిరిజన తండాలు రాజ్యాధికారంతో తండాల రూపురేఖలు మారాయి. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో తండాలు మునుపెన్నడూ లేనంతంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. మండల పరిధిలోని వాల్యానాయక్‌తండా పల్లె ప్రగతి, జడ్పీ, డీఎంఎఫ్టీ నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి. తండా అభివృద్ధి చెందడంతో వలస వెళ్లిన కుటుంబాలు తండాకు తిరిగి వస్తున్నాయి. 150 కుటుంబాలు ఉన్న తండాలో 750 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. తండా చిన్నదైనప్పటికీ అభివృద్ధిలో తళుక్కుమంటుంది.
పల్లె ప్రగతితో అభివృద్ధి పరుగులు
పల్లె ప్రగతి కార్యక్రమంతో తండాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. రూ. 12 లక్షల 60వేలతో వైకుంఠధామం నిర్మాణం, రూ. 4 లక్షలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు, రూ. 2 లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ. లక్షలతో మినీ ట్రాక్టర్ కొనుగోలు, 11 వేల మొక్కలతో తండాలో నర్సరీ, రోజు విడిచి రోజు తండాలో చెత్త సేరకణ, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తండాలో ఉన్న పెద్ద మురుగునీటి గుంతను రూ. 50 వేలు ఖర్చుచేసి పూడ్చివేశారు. తండా ప్రజల తాగునీటి అవసరం కోసం రెండు మంచినీటి ట్యాంకులు, తండాలో పశువులు తాగేందుకు నీటి తొట్లను నిర్మించారు. గోనమ్మ ఆలయం వద్ద రెండు వేల మొక్కలు నాటారు.
మురుగు కాల్వలు, సీసీ రోడ్లు
రూ. 8 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో మురుగు కాల్వలు, సీసీ రోడ్లను నిర్మించారు. రూ.2లక్షలతో మురుగు కాల్వ, రూ. 2 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రూ. 4లక్షలతో తండాలోకి వచ్చే ప్రధాన రోడ్డు వరకు సీసీ రోడ్డు, రూ. 2లక్షల జడ్పీ నిధులతో తండాలో సీసీ రోడ్డు నిర్మించారు.
తండా అభివృద్ధికి కృషి చేస్తా..
తండా పంచాయతీగా ఏర్పాటు అయ్యాక మొదటి సర్పంచ్‌గా ఎన్నికయ్యాను, తండా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ఎమ్మెల్యే సహకారంతో తండాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తాను. ఆదర్శతండాగా చేయడమే నా ప్రథమ కర్తవ్యం. తండా అభివృద్ధికి ప్రజల సహకారం చాలా ఉంది.
అందరి సలహాలు తీసుకుంటున్నాం..
ప్రభుత్వ నిధులను సరైన రీతిలో ఖర్చు చేసి తండాలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రగతిలో ప్రజలను భాగాస్వాములను చేస్తూ ముందుకు పోతున్నాం. ప్రతి నెలా వార్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులపై సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతున్నది.