బొంరాస్పేట, నవంబర్ 7 :పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. చమురు ధరల పెరుగుదల పరోక్షంగా ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో రవాణా చార్జీలు కూడా పెరుగుతున్నాయి వీటి ఫలితంగా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలకు రెక్కలు వస్తున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలకు పెరిగిన ధరలు భారంగా మారుతున్నాయి. రోజూ కూలీనాలి చేసుకుని బతుకుబండి లాక్కొస్తున్న పేద లు ఏమీ కొనలేక సతమతమవుతున్నారు. మండలంలోని బొంరాస్పేట, తుంకిమెట్ల గ్రామాలలో ఆదివారం జరిగిన వారాంతపు సంతల్లో కూరగాయల ధరలు చుక్కలనంటాయి. ధరలను చూసి సామాన్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. గత వారంతో పోలిస్తే ఈ వారం ధరలు అ మాంతం పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు. ముఖ్యంగా గతవారం కిలో టమాట ధర రూ.30లు ఉండగా ఈవారం రూ.60లకు చేరిం ది. అదేవిధంగా చిక్కుడుకాయ, బెండకాయ, వంకాయలు, బీరకాయ, కాకరకాయలు ధరలు కిలో రూ.60లకు చేరుకున్నాయి. ఆకు కూరల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. భారీ వర్షాల కారణంగా కూరగాయల తోటలకు రోగాలు వ్యాపించి దిగుబడులు తగ్గడం, చమురు ధరల పెరుగుదలతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం సంతలకు గ్రామాల నుంచి వచ్చే కూరగాయలు బాగా తగ్గాయి. ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో ధరలు పెరుగుతున్నాయి. కేంద్రం స్పందించి చమురు ధరలను తగ్గిస్తే నిత్యావసర సరుకులతో పాటు ఇతర వస్తువుల ధరలు దిగి వస్తాయని ప్రజలు భావిస్తున్నారు.
కొనలేకపోతున్నాం
కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. గత వా రంతో పోలిస్తే ఈ వారం రెండితలయ్యాయి. పెరిగిన ధరలతో పేదలు ఏమీ కొనలేక పోతున్నారు. కూలీ నాలి చేసుకునే వారి సంపాదనంతా కూరగాయల కొనుగోళ్లకు సరిపోవడం లేదు. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గితే ధరలు తగ్గే అవకాశం ఉంది.
-సుమిత్రబాయి,బొట్లవానితండా
వర్షాలకు తోటలు పాడయ్యాయి
భారీ వర్షాలకు గ్రామాల్లో రైతులు సాగు చేసిన కూర గాయల తోటలకు రోగాలు వచ్చి పాడయ్యాయి. దీంతో దిగుబడి బాగా తగ్గింది. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న టమాట, ఇతర కూరగాయలన్నీ బెంగళూరు, గుల్బర్గా నుంచి వస్తు న్నా యి. ఫలితంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
-రఘుపతిరెడ్డి, కూరగాయల వ్యాపారి