పోడు భూముల సమస్య పరిష్కారానికి సర్కారు కార్యాచరణ చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే సాగులో ఉన్న అటవీ భూములను గుర్తించగా.. పట్టాలిచ్చేందుకు అర్హులైన రైతులను తేల్చేందుకు సన్నద్ధమయ్యారు. సోమవారం నుంచి ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా గ్రామ సభలు నిర్వహించి పోడు భూములకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఆ తరువాత పోడు భూమి సాగుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీటిని గ్రామ, డివిజన్ స్థాయి కమిటీలు నెలరోజులపాటు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన రైతుల వివరాలను జిల్లా స్థాయి కమిటీకి అందిస్తాయి. అక్కడ ఆమోదం పొందిన తరువాత ఫైనల్ జాబితా ప్రభుత్వానికి చేరనున్నది. ఈ ప్రక్రియ పర్యవేక్షణ కోసం ప్రతి మండలం, మున్సిపాలిటీ, నియోజకవర్గానికి ఒకరు చొప్పున జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 2,449.48 ఎకరాల పోడు భూములు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 670 ఎకరాల అటవీ భూమిని 780 మంది రైతులు సాగు చేస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారులు గుర్తించారు.
పరిగి/షాబాద్ : పోడు భూముల సమస్యల పరిష్కారానికి సర్కారు కార్యాచరణ రూపొందించింది. ఇందులోభాగంగా సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించి రైతులకు పోడు భూములపై అవగాహన కల్పించనుంది. గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరించి నెల రోజుల వరకు పరిశీలిస్తారు. దరఖాస్తు ఫారాలను ఉచితంగా అందజేస్తారు. దరఖాస్తులను పరిశీలించేందుకు రైతులు, అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు సభ్యులుగా గ్రామ, డివిజన్ స్థాయి కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. గ్రామ సభల్లో అర్హులైన రైతులను గుర్తించి ఆ వివరాలను జిల్లాస్థాయి కమిటీకి అందిస్తారు. ఆమోదం పొందిన తర్వాత వారి జాబితాను ప్రభుత్వానికి పంపిస్తారు.
వికారాబాద్ జిల్లాలో 2449.48, రంగారెడ్డి జిల్లాలో 670 ఎకరాల పోడు భూముల్లో రైతులు సాగు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. సర్వేలో ఈ విస్తీర్ణం మరింత పెరుగవచ్చని భావిస్తున్నారు. ప్రత్యేకాధికారుల నియామకం పోడు భూముల సమస్యల పరిష్కారానికి సంబంధించి పూర్తిస్థాయి పర్యవేక్షణకు ప్రతి మండలానికి, మున్సిపాలిటీకి ఒకరు చొప్పున జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. నియోజకవర్గాలవారీగా సైతం ప్రత్యేకాధికారులనియామకం చేపట్టారు.
వికారాబాద్ జిల్లాలోని 13 మండలాల్లో 27 గ్రామాల్లో అటవీ భూములు 2449.48 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాలోని 5 మండలాల్లో 670 ఎకరాలు అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు అధికారులు అంచనా వేశారు.
దరఖాస్తుల స్వీకరణ.. అర్హుల గుర్తింపు
ప్రభుత్వ ఆదేశాల మేరకు పోడుదారుల నుంచి అధికారులు గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణతోపాటు పరిశీలన ప్రక్రియ చేపట్టి అర్హులను గుర్తిస్తారు. ఇందుకుగాను ఇప్పటికే అటవీ రైతు కమిటీలను జిల్లా అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీలో 10-15 మంది సభ్యులుంటారు. వీరిలో రెవెన్యూ, గిరిజన అభివృద్ధి శాఖ అధికారులతోపాటు ఏడుగురు గిరిజన రైతులుంటారు.(వీరిలో ముగ్గురు మహిళా రైతులు). ఏ గ్రామాల్లో అయితే పోడు భూములు సాగు చేసుకుంటున్నారో.. సంబంధిత గ్రామాల్లో ఈ కమిటీలు మూడు రోజులపాటు గ్రామ సభలు నిర్వహిస్తాయి. సభల్లో స్వీకరించి దరఖాస్తులను పరిశీలించి డివిజన్‌స్థాయి కమిటీకి అందజేస్తారు. ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం జిల్లాస్థాయి కమిటీకి చేరవేస్తారు. అర్హులను గుర్తించి వారికి ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాలు అందజేయాలన్నది సర్కారు ఆలోచన. ఇందుకుగాను పక్కాగా లెక్క తేల్చడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. అటవీ ప్రాంతాల పరిస్థితిపై సంవత్సరాలవారీగా శాటిలైట్ మ్యాప్‌లు తెప్పించినట్లు సమాచారం. ఈ మ్యాప్‌ల ఆధారంగా అటవీ ప్రాంతం ఎప్పుడు ఆక్రమణకు గురైంది తేలనుంది.
వికారాబాద్ జిల్లాలో మండలాలవారీగా ప్రత్యేకాధికారులు
మండలం ప్రత్యేకాధికారి
వికారాబాద్ సుభాషిణి(జడ్పీ డిప్యూటీ సీఈవో)
ధారూరు మల్లేశం(డీఎస్సీడీవో, వికారాబాద్)
కోట్‌పల్లి రాజేశ్వర్ప్రసాద్(డీసీఎస్వో)
బంట్వారం సుజాత(డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ ఆఫీసర్)
మర్పల్లి అనిత(డీఎల్పీవో, వికారాబాద్)
మోమిన్‌పేట బాబు మోజెస్(ఈడీ, ఎస్సీ కార్పొరేషన్)
పరిగి పుష్పలత(డీబీసీడీవో)
పూడూరు సుధారాణి(డీఎండబ్ల్యూవో, వికారాబాద్)
దోమ సరళ(ఏపీడీ, డీఆర్డీవో)
కులకచర్ల వినయ్‌కుమార్(జీఎం డీఐసీ)
తాండూరు సాంబశివరావు(ఏడీ గనుల శాఖ
యాలాల రాంరెడ్డి(ఏడీ ఎస్‌అండ్‌ఎల్‌ఆర్)
పెద్దేముల్ వీరభద్రరావు(ఆడిట్ ఆఫీసర్)
బషీరాబాద్ స్టీవెన్ నీల్(అడిషనల్ పీడీ, డీఆర్డీఏ)
కొడంగల్ దుర్గాప్రసాద్(జిల్లా అటవీ శాఖ అధికారి)
దౌల్తాబాద్ శ్రీనివాస్‌రావు(అసిస్టెంట్ కమిషనర్, కార్మిక శాఖ)
బొంరాస్‌పేట్ చంద్రప్రకాశ్(డీఎల్పీవో, తాండూరు)
నవాబుపేట్ లలితకుమారి(డీడబ్ల్యూవో, వికారాబాద్)
వికారాబాద్ జిల్లాలో నియోజకవర్గాలవారీగా ప్రత్యేకాధికారులు
నియోజకవర్గం ప్రత్యేకాధికారి
వికారాబాద్ ఉపేందర్‌రెడ్డి(ఆర్డీవో)
పరిగి జానకీరెడ్డి(జడ్పీ సీఈవో)
తాండూరు అశోక్‌కుమార్(ఆర్డీవో)
కొడంగల్ ఎం.ఎ.కృష్ణన్(డీఆర్డీవో)
చేవెళ్ల మల్లారెడ్డి(డీపీవో)
మున్సిపాలిటీలవారీగా ప్రత్యేకాధికారులు
మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి
వికారాబాద్ వేణుమాధవరావు(జిల్లా అటవీ శాఖ అధికారి)
తాండూరు హన్మంత్‌రావు(డీవైఎస్వో)
పరిగి సదానందం(అసిస్టెంట్ డైరెక్టర్, డీవీఏహెచ్)
కొడంగల్ విమల(జిల్లా మేనేజర్, పౌర సరఫరాల శాఖ)
దరఖాస్తుల స్వీకరణ : వేణుమాధవరావు, వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి
జిల్లాలోని పోడు భూముల సమస్యలు ఉన్న గ్రామాల్లో సోమవారం సర్పంచ్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేస్తారు. మూడు రోజులు ప్రజలకు పోడు భూములపై అవగాహన కల్పిస్తారు. ప్రతి గ్రామంలో దరఖాస్తు ఫారాలు ఉచితంగా అందజేస్తాం. గురువారం నుంచి ఆయా గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. కమిటీ సభ్యులందరూ క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటారు.
వికారాబాద్ జిల్లాలో మండలాలవారీగా పోడు భూముల్లో సాగు
మండలం గ్రామాలు ఎకరాలు
బషీరాబాద్ 3 748.08
మర్పల్లి 1 46
పెద్దేముల్ 3 123.45
తాండూరు 1 44.63
బొంరాస్‌పేట్ 3 539.625
దౌల్తాబాద్ 1 20.50
కొడంగల్ 2 132.20
కులకచర్ల 1 16.50
పరిగి 2 181.125
మోమిన్‌పేట్ 1 10
వికారాబాద్ 2 267.90
కోట్‌పల్లి 3 37
యాలాల 4 282.475
మొత్తం 27 2449.48
రంగారెడ్డి జిల్లాలో మండలాలవారీగా
పోడు భూముల్లో సాగు
మండలం రైతులు ఎకరాలు
మంచాల 411 555
హయత్‌నగర్ 15 32.11
ఇబ్రహీంపట్నం 10 10
సరూర్‌నగర్ 336 58
అబ్దుల్లాపూర్‌మెట్ 8 15
మొత్తం 780 670.11