అంగన్వాడీ కేంద్రాల్లో ఇక సేవలన్నీ మరింత పారదర్శకం కానున్నాయి. అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం ‘పోషణ్ ట్రాకర్’ యాప్‌ను రూపొందించింది. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి స్మార్ట్‌ఫోన్ అందజేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి స్మార్ట్ ఫోన్లు సిద్ధంగా ఉండగా, వచ్చే వారం పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 1106 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. సిబ్బంది ఉదయం అంగన్వాడీ కేంద్రానికి రాగానే ‘పోషణ్ ట్రాకర్’ యాప్‌కు లాగిన్ కావాలి. హాజరైన చిన్నారుల ఫొటోతో పాటు గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం, సేవలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో సూపర్వైజర్ మొదలుకుని జిల్లా ఉన్నతాధికారుల వరకు ఒక్క క్లిక్‌తో వివరాలన్నీ తెలుసుకోవచ్చు.
పరిగి, నవంబర్ 6 : అంగన్వాడీ కేంద్రాల్లో అందజేస్తున్న సేవలు మరింత పారదర్శకంగా అమలు కోసం ప్రభుత్వం ప్రతి అంగన్వాడీ కేంద్రానికి స్మార్ట్ఫోన్లు అందజేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలు కొనసాగుతుండగా, వికారాబాద్ జిల్లాకు సంబంధించి సైతం త్వరలోనే అమలు కోసం స్మార్ట్ఫోన్లు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వాటిని వచ్చే వారం ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అందజేయనున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 1106 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 56వేల మంది చిన్నారులు విద్యాభ్యాసం చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు 15,200 మంది ఉన్నారు. ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి ఒకటి చొప్పున ఈ స్మార్ట్ఫోన్లు పంపిణీ చేస్తారు. తద్వారా ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు ఎప్పటికపుడు ఆన్లైన్లో నమోదు చేస్తారు.
అన్ని సేవలు ఆన్లైన్లో నమోదు
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలన్నీ ఆన్లైన్లో నమోదు కోసం స్మార్ట్ఫోన్లను అందజేస్తారు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒకటి చొప్పున ఈ ఫోన్లు అందజేస్తారు. ప్రతిరోజూ ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన వెంటనే ‘పోషణ్ ట్రాకర్’ యాప్‌లో లాగిన్ అయిన తర్వాత అంగన్వాడీ కేంద్రానికి ఎంత మంది చిన్నారులు వచ్చారు ఫొటో తీసి వివరాలతో నమోదు చేపట్టాలి. అలాగే చిన్నారులకు మధ్యాహ్నం సమయంలో పౌష్టికాహారం అందజేసే సమయం, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేసే సమయంలో ఫొటోలు తీయడంతోపాటు ఎంతమందికి పోషకాహారం, కోడిగుడ్లు అందజేసిన వివరాలు పోషణ్ ట్రాకర్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే కేంద్రంలో ఎంతమంది చిన్నారులు ఉన్నారు, వారిలో ఎంతమందికి టీకాలు వేశారు. నవజాత శిశువుల వివరాలు, పిల్లల ఎదుగుదల, బరువు, కొలతలు తదితర అంశాలన్నీ ఈ యాప్‌లో ఎప్పటికపుడు నమోదు చేపట్టాలి.
కేంద్రాల వారీగా..
ప్రతి అంగన్వాడీ కేంద్రం ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలన్నీ ఆన్లైన్లో నమోదుతో ఉన్నతాధికారులకు ప్రతిరోజూ వారి సమాచారం ఉంటుంది. ఏదైనా కేంద్రంలో సేవలు ఎలా అందుతున్నాయి తెలుసుకునేందుకు ఆ కేంద్రానికి వెళ్లి పరిశీలిస్తే తెలుస్తుంది. కొత్తగా స్మార్ట్ఫోన్లు అందజేసి ఎప్పటికపుడు సమాచారాన్ని ఫొటోలతో సహా అంగన్వాడీ కేంద్రాల వారీగా నమోదు చేయడంతో సంబంధిత కేంద్రంలో అందుతున్న సేవలన్నీ పారదర్శకంగా తెలుసుకోవచ్చు. సూపర్వైజర్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి వరకు ఏ అంగన్వాడీ కేంద్రంలో ఎంతమంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించారు తదితర అంశాలు ఒక్క క్లిక్‌తో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే ప్రతి సేవకు సంబంధించిన సమాచారం ఆన్లైన్ ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకునే వీలుండడంతో మరింత నాణ్యమైన సేవలు అందనున్నాయి. అలాగే ఉన్నతాధికారులకు అందజేసే నివేదికలు సైతం ఇకమీదట ఈ ఫోన్ల ద్వారానే ఆన్లైన్లో నమోదు చేసి పంపించేందుకు అవకాశం కలుగుతుంది. అందులో ఉండే ఫార్మాట్ల ఆధారంగా వివరాలు ఆయా అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు నమోదు చేస్తారు. తద్వారా నివేదికలన్నీ సకాలంలో ఉన్నతాధికారులకు చేరడానికి ఈ విధానం దోహదం చేయనున్నది.
వచ్చే వారం అందజేస్తాం
అంగన్వాడీ కార్యకర్తలకు వచ్చే వారం స్మార్ట్ఫోన్లు అందజేస్తాం. ఇందుకు సంబంధించిన స్మార్ట్ఫోన్లు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో 1106 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రతి కేంద్రానికి ఒకటి చొప్పున స్మార్ట్ఫోన్లు అందజేసేలా చర్యలు చేపట్టాం. ఈ కేంద్రాల ద్వారా అందుతున్న ప్రతి సేవకు సంబంధించిన ఫొటోతోపాటు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడానికి ఈ ఫొన్లు దోహదపడుతాయి. తద్వారా ఏ కేంద్రంలో ఎంతమంది చిన్నారులు హాజరయ్యారు, ఎంతమంది గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, కోడిగుడ్లు అందజేశారు, ఇతర వివరాలు తెలుస్తాయి.