యాచారం, నవంబర్ 6 : కార్తిక మాసం శివకేశవుల ప్రీతికరం.. అందుకే ఈ మాసాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. దైవసంబంధికమైన వ్రతాలు, నోములు, ఉపవాసాలు, దీక్షలు, శుభకార్యాలకు మాసం ఎంతో ప్రాధాన్యమైనదిగా చెప్పవచ్చును. శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసంలో దీపారాధనకు ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఆయా మాసాల్లో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృతిక నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి పేరు వచ్చినట్లుగా పూర్వికులు చెబుతుంటారు. ప్రతి సోమవారం కృతిక నక్షత్రానికి దీపారాధన చేసేందుకు భక్తులు ప్రాధాన్యతనిస్తారు. కార్తిక ప్రారంభం నుంచి సూర్యోదయానికి సూర్వమే లేచి నది స్నానం ఆచరించి తడి బట్టలతో దీపారాధన చేయడం ఆనవాయితీ. మహిళలు వ్రతాలు, నోములు, ఆచరిస్తారు. బ్రాహ్మణుడికి దీపం దానం చేస్తే ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకుంటారు. తులసి మారేడు, ఉసిరి కాయలతో శివాలయాలు, విష్ణువు ఆలయాల్లో దీపాలు వెలిగించిన వారికి అన్ని రకాలుగా శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. తులసి సన్నిధిలో దేవాలయంలో దీపం వెలిగించే వారికి అష్ట ఐశ్వర్యం సిద్ది కలుగడమే కాకుండా శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు తొలిగిపోతాయనేది భక్తుల అపార నమ్మకం. ఏకదశి నుంచి పున్నమి వరకు మహిళలు భీష్మవంచక వ్రతం చేస్తారు. ఈ ఐదు రోజులు శివ మంత్రం, విష్ణుమంత్రం ఉపదేశం పొందడం ఎంతో ఫలితాన్ని ఇస్తుందని భావిస్తారు.
ఆచరించాల్సిన నియమాలు
భక్తులు కొన్ని నియమాలు పాటించడం ఎంతో ముఖ్యం. స్నానం చేసిన తరువాత దేవుడి పూజలకు ఉపయోగించే ఆసనం(పీఠ) వేరే పనికి ఉపయోగించొద్దు. పూజలు చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఏకదశి రోజున ఉపవాసం ఉండాలి. మంగళవారం బూడిద గుమ్మడికాయ ఇంటి సింహద్వారానికి కట్టాలి. మట్టి, ఇత్తడి ప్రమిదల్లో దీపాలను వెలిగించాలి. ఆకులతో చేసిన దీపాలను వెలిగించేవారు మేడి ఆకులు, రావి ఆకులు, బిల్వ పత్రం, తమలపాకులు, మర్రిచెట్టు ఆకులను ఉపయోగించొద్దు. పుష్ప దీపం, ఉసికాయల దీపాలు వెలిగించడంతో ఎంతో మేలు చేకూరుతున్నది. మహా కార్తిక స్నానం పుణ్య ప్రదం. అరుణోదయవేళ శివాలయం, విష్ణు ఆలయాల్లో గడుపాలి.
కార్తీకాభిషేకం
శివుడికి అత్యంత ప్రీతిప్రాదాయకమైన ఈ మాసంలో శివయ్యకు అభిషేకం, అర్చనలు చేస్తే సర్వం మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. భక్తులు రకరకాల అభిషేకాలను నిర్వహిస్తారు. ఇందులో ఆవుపాలు, నెయ్యితో అభిషేకం, బిల్వార్చనాభిషేకం, జాజిపూలు గంగాజలాభిషేకం, పెరుగు తేనాభిషేకం, చెరుకు, మామిడి రసాలతో, రుద్రాక్షలు, నవధాన్యాలు, పసుపునీరు, భస్మజలం, బెల్లం, అన్నపూజ, విభూతి, చందనం, తులసీ దళంతో, వివిధ రకాల పుష్పాలతో అభిషేకం చేస్తే సకల కార్యం సిద్ధిస్తుందని పూర్వికులు చెబుతున్నారు.
దీపారాధన
ఈ మాసంలో దీపం వెలిగిస్తే విద్యావంతులు, జ్ఞానవంతులు, ఆయుష్యవంతులవుతారని, అనేక విధాలుగా మోక్షం పొందుతారని పూర్వికులు చెబుతున్నారు. సాయంత్రం శివాలయంలో దీపాన్ని వెలిగిస్తే అనంతమైన పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. నెలరోజులుగా దీపాలు పెట్టడం సాంప్రదాయం. ఇందులో ఉసిరిక దీపం, నారికేళ దీపం, పుష్పదీపం, నదీ దీపాలను వెలిగించవచ్చు. ఏదైనా కారణంవలన 30రోజులు దీపం పెట్లలేని వారు కనీసం శుద్ద ద్వాదశి, చతుర్ధశి, పూర్ణిమ రోజుల్లోనైనా దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుంది.
ఆకాశ దీపం
కీటకాలు, పక్షులు అభాగీనులై పుణ్యలోకాలకు చేరలేని సమస్త జీవలోకానికి ఆకాశ దీపం దర్శనం సద్గతులు కలిగిస్తుంది. శివాలయాల్లో ద్వజ స్తంభానికి ఆకాశ దీపాన్ని కడుతారు. మూడు సిబ్బెలలో దీపాలను వెలిగించి ద్వజ స్తంభంపైకి చేర్చుతారు. సాయం కాలంలో నువ్వుల నూనెతో ఆకాశ దీపారాధన చేస్తే రూప, సౌందర్య, సౌభాగ్య సంపదలు వృద్ధి చెందుతాయి. ఇంటి వద్ద కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చును.
ఆరోగ్యదాయకం తిలామలక స్నానం
పవిత్ర స్నానాలాచరించే ముందు తిలామలక మిశ్రమాన్ని శరీరానికి లేవనం చేసుకుంటారు. ఆమలకం అంటే ఉసిరిక, తిలలు అంటే నువ్వులు ఈ రెండింటి మిశ్రమాన్ని రాసుకోవడం ద్వారా శరీర రుగ్మతలు నశించి ఆరోగ్యం చేకూరుతుంది. విజ్ఞాన పరంగా చూస్తే శరీరంపై గల కురుపులు, దద్దుర్లు, ఫంగస్ నశించడానికి ఈ స్నానం ఎంతో ఉపకరిస్తుంది.
సోమవారం వ్రతం
కార్తిక మాసంలో సోమవారం ప్రత్యేక వ్రతమాచరిస్తారు. ఈ రోజున చేసిన పూజలు, అభిషేకాలు, దానాలకు ఈశ్వరుడు అధికంగా సంతుష్టుడవుతాడని, భక్తుల సర్వాభీష్టాలను తీరుస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి సోమవారం శివాలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
బొమ్మల కొలువులు
కార్తిక శుక్లపక్షం మొదటి రోజున మహిళలు బొమ్మల కొలువుతో గోవర్ధన పూజను నిర్వహిస్తారు. శ్రీకృష్ణ హగవానుడిని బొమ్మగా తయారుచేసి నీరు, పూలు, పెరుగు, కుంకుమ, బియ్యం, మిఠాయిలో నైవేద్యం సమర్పిస్తారు. రెండో రోజున భగినిఆస్త భోజనం అనే పండుగను సోదరుల సంక్షేమం కోసం సోదరిమణులు నిర్వహిస్తారు. కార్తి శుద్ద చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. ఆధ్యాత్మికత, ఆనందం, ఆరోగ్యం, సంతోషాలతో, విందు భోజనాలతో, శుభకార్యాలతో ఈ మాసం గడుపుతారు.
ఉసిరి చెట్టుకు పూజలు
ఉసిరి చెట్టు వద్ద విష్ణు పూజలు అధికంగా నిర్వహిస్తారు. ఉసిరి చెట్టును పూజిస్తే దివ్య క్షేత్రాల్లో విష్ణువుకు పూజలు చేసినంత ఫలితం లభిస్తుందని భక్తులు భావిస్తారు. ఉసిరి కాయలు, ఉసిరి ఆకులను ఇంటికి తీసుకెళ్లి కుటుంబమంతా తలస్నానాలు చేస్తారు. ఈ ఉసిరికాయ, ఆకుల్లో వివిధ పోషక గుణాలు కలిగి ఉండటంతో పాటుగా వీటితో స్నానమాచరిస్తే భక్తి, ముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
వన భోజనాలు
వనభోజనాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. రావి, ఉసిరి, మామిడి, మారేడు వంటి చెట్ల కింద సామూహిక వన భోజనాలు చేస్తారు. ఆధునిక కాలంలో కూడా ప్రకృతితో ఉన్న అనుబంధం వన భోజనాలతో కనిపిస్తుంది. కుటుంబమంతా ప్రశాంత వాతావరణంలో ఆత్మీయ బంధాలనుపంచుకుంటూగడపడం ఎంతో ఆనందాన్నిస్తుంది.
ఆలయాల్లో సందడి
భక్తుల ప్రత్యేక పూజలతో మండలంలోని ప్రధాన ఆలయాల్లో సందడివాతావరణం నెలకొన్నది. ముఖ్యంగా సోమవారం శివాలయాలు, శనివారం వేంకటేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. మండలంలోని నందివనపర్తి గ్రామంలో కొలువుదీరిన సిద్దేశ్వరాలయం, నందీశ్వర మహాక్షేత్రం, ఓంకారేశ్వరాలయం, జ్ఞాన సరస్వతీ ఆలయాల్లో కార్తిక పూజలు ఘనంగా నిర్వహిస్తారు. మండల కేంద్రంలోని తిరుమల గుట్టపైన కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి ఆలయం, చౌదర్పల్లి గేటు వద్ద ఉన్న సాయి మందిరంతో పాటుగా పురాతన దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు.