వికారాబాద్ జిల్లా పరిధిలో 4 మైన్లు, 226 క్వారీలు ఉన్నాయి. వీటిలో సున్నపురాయి, సిమెంటు తయారీకి సంబంధించినవి, ఎర్రమట్టి, సుద్ద, నాపరాయి, పలుగురాళ్లు, కంకర తదితరాలు లభిస్తాయి. భూగర్భ వనరులకు సంబంధించిన లీజులపై రాయల్టీ, సీనరేజ్ రూపంలో సర్కారుకు ఆదాయం సమకూరుతున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.44.84కోట్ల ఆదాయం వచ్చిందని మైనింగ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏడాది పూర్తయ్యేలోగా ఈ ఆదాయం పెరుగడంతో పాటు కొత్త పాలసీతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉన్నది.
పరిగి, నవంబర్ 2 : వికారాబాద్ జిల్లా పరిధిలో మైనింగ్ ద్వారా ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. గత సంవత్సరం కరోనా సంక్షోభ సమయంలో కొంత తగ్గినా ఆ తర్వాత యథావిధిగా ఆదాయం చేకూరింది. ఈసారి ఇప్పటివరకు వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే గత సంవత్సరం కంటే అధికంగానే ఆదాయం చేకూరుతున్నది. ఈ సంవత్సరం ఇప్పటివరకు రూ.44.84 కోట్ల ఆదాయం చేకూరగా మిగతా సమయంలో మరింత ఆదాయం పెరుగుతుందని సంబంధిత శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
రెండు రకాల లీజులపై ప్రభుత్వానికి ఆదాయం
ప్రభుత్వానికి మైనింగ్ లీజులపై, అలాగే క్వారీలకు సంబంధించిన లీజులపై ఆదాయం వస్తుంది. వికారాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం 4 మైనింగ్ లీజులు ఉన్నాయి. వీటి కింద సున్నపురాయి, సిమెంటు తయారీకి సంబంధించినవి వస్తాయి. చిన్నతరహాకు సంబంధించి ఎర్రమట్టి, సుద్ద, నాపరాయి, పలుగురాళ్లు, కంకర తదితర క్వారీలు వస్తాయి.
జిల్లా పరిధిలో చిన్న తరహా క్వారీలు 226 ఉన్నాయి. వాటిలో తీసే భూగర్భ వనరులకు సంబంధించి ఎప్పటికప్పుడు రాయల్టీ, సీనరేజ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. ఒక్కో భూగర్భ వనరుకు సంబంధించి ఒక్కో రకంగా రాయల్టీ, సీనరేజ్ చార్జీలు ఉంటాయి. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఈ చార్జీల వసూలు జరుగుతుంది.
ఇప్పటికే రూ.44.84కోట్ల ఆదాయం
వికారాబాద్ జిల్లా పరిధిలోని మైనింగ్‌లు, క్వారీల ద్వారా సర్కారుకు ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 21 వరకు రూ.44.84కోట్ల ఆదాయం చేకూరింది. ఇందులో మైనింగ్ లీజులు, సిమెంటు ఫ్యాక్టరీల ద్వారా ఇప్పటివరకు రూ.23.16 కోట్లు రాయల్టీ, చిన్న తరహా క్వారీల నుంచి రూ.21.68 కోట్లు సీనరేజ్ వసూలైంది. మరో ఐదు నెలల సమయం ఉండడంతో ఈ ఆదాయం మరింత పెరుగనుంది. ఈసారి కరోనా సంక్షోభం నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే పాత పరిస్థితులు నెలకొంటున్నాయి. తద్వారా మైనింగ్ పెరిగి, రాయల్టీ, సీనరేజ్ ద్వారా సర్కారుకు గత సంవత్సరం కంటే అధికంగా ఆదాయం చేకూరనుంది.
భూగర్భ వనరులకు సంబంధించి ప్రభుత్వానికి ఆదాయం మరింత పెరుగనుంది. ఇందుకు సంబంధించి సర్కారు కొత్త మైనింగ్ పాలసీని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నది. కొత్త పాలసీకి సంబంధించి ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. ఈ పాలసీలో అనేక అంశాలపై పూర్తిస్థాయిలో ఆదాయం పెరిగేలా ఉండనుందని అధికారులు తెలిపారు.
పెరుగనున్న ఆదాయం
వికారాబాద్ జిల్లా పరిధిలో మైనింగ్ శాఖ ద్వారా ఈసారి ఆదాయం మరింత పెరుగనుంది. అక్టోబర్ 21 వరకు రూ.44.84 కోట్ల ఆదాయం చేకూరింది. మరో ఐదు నెలల సమయం ఉండడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో గత సంవత్సరం కంటే అధికంగా ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వం కొత్త మైనింగ్ పాలసీని అమలులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతున్నది. కొత్త పాలసీ వచ్చిన తర్వాత ఆదాయం మరింత పెరుగుతుంది.