Vijay | కోలీవుడ్ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు.అభిమానుల గుండెల్లో “దళపతి”గా ప్రత్యేక స్థానం సంపాదించిన విజయ్, రీల్ లైఫ్ హీరో నుంచి రియల్ లైఫ్ పొలిటీషియన్‌గా మారి తొలి ఎన్నికల్లోనే తన పార్టీ తమిళగ వెట్రి కళగంను విజయతీరాలకు చేర్చడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో విజయ్ వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం గురించి నెటిజన్లు విస్తృతంగా తెలుసుకోవాలనుకుంటున్నారు.విజయ్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి శోభ చంద్రశేఖర్ గాయని, రచయిత్రి, నిర్మాతగా కూడా పనిచేశారు. తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రచయిత. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి, తనదైన ముద్ర వేశారు.
విజయ్ తల్లిదండ్రులకు తెలుగు సినీ పరిశ్రమతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి వారు మూడు బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. 1981లో వచ్చిన చట్టానికి కళ్ళు లేవు చిత్రంతో ఎస్.ఏ. చంద్రశేఖర్ తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇది తమిళ హిట్ మూవీ రీమేక్‌గా రూపొంది మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం 1983లో వచ్చిన పల్లెటూరి మొనగాడు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. 1984లో విడుదలైన దేవాంతకుడు కూడా విజయవంతమై, చిరంజీవి కెరీర్లో కీలక చిత్రంగా నిలిచింది. ఈ మూడు చిత్రాలకు విజయ్ తల్లి శోభ కథ అందించడం విశేషం. ఇలా విజయ్ కుటుంబం తెలుగు సినిమా అభివృద్ధిలో కూడా తన వంతు పాత్ర పోషించింది. అదనంగా, ‘దోపిడీ దొంగలు’, ‘ఇంటికో రుద్రమ్మ’ వంటి మరికొన్ని తెలుగు చిత్రాలకు కూడా చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.
విజయ్ చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ప్రారంభించారు. 1992లో తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన నాలైయ తీర్పు ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన నటనను మెరుగుపరుచుకుంటూ కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఎదిగారు. ఇప్పటివరకు ఆయన సుమారు 69 చిత్రాల్లో నటించారు.తెలుగు దర్శక నిర్మాతలతో ఆయనకు మంచి అనుబంధం ఉన్నప్పటికీ, స్ట్రెయిట్ తెలుగు సినిమా మాత్రం చేయలేదు. అయితే వారసుడు (తమిళంలో ‘వారిసు’) ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తొలి ఎన్నికల్లోనే విజయాన్ని అందుకోవడం విశేషం. ఆయన చివరి చిత్రం గా ప్రచారం జరుగుతున్న జన నాయకుడు త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.