RanaBaali | గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయ్ దేవరకొండ అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే సర్ప్రైజ్ను ఇచ్చింది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్టుకు ‘రణబాలి’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 1854 నుంచి 1878 మధ్యకాలంలో బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అప్పట్లో బ్రిటిష్ వారు సృష్టించిన కరువు పరిస్థితులు, వారి అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక వీరయోధుడి కథను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. విడుదలైన గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ ఒక రఫ్ అండ్ పవర్ఫుల్ వారియర్ లుక్‌లో కనిపిస్తుండగా, బ్రిటిష్ వారు అతడిని ఒక అనాగరికుడిగా పిలిచేవారని, కానీ మన చరిత్రలో అతడొక గొప్ప వీరుడని గ్లింప్స్ ద్వారా స్పష్టం చేశారు. ‘టాక్సీవాలా’ వంటి విజయం తర్వాత విజయ్ – రాహుల్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది కావడం విశేషం.
ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న ‘జయమ్మ’ అనే పాత్రలో నటిస్తోంది. వీరిద్దరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, హాలీవుడ్ చిత్రం ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ – అతుల్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ భారీ చిత్రాన్ని సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.