Mexico | మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఫుట్‌బాల్ మైదానంలో దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు. 12 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఒక మహిళ, చిన్నారి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మెక్సికోలోని గ్వానాహువాటో రాష్ట్రం సలమంకా నగరంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. సాకర్ మ్యాచ్ పూర్తయిన తర్వాత పలువురు అభిమానులు మైదానంలోనే ఉన్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన పలువురు దుండగులు కాల్పులకు దిగారు. దాదాపు 100 రౌండ్ల కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన వెనుక గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
అయితే ఈ ఘటన వెనునక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ ఉందని సలమంకా మేయర్ సీజర్ ప్రిటో తెలిపారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు మెక్సికో ప్రభుత్వం సహకరించాలని కోరారు. అధికారులను లొంగదీసుకునేందుకు క్రైమ్ గ్యాంగ్‌లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
గ్వానహువాటోలో చమురు దోపిడీ, డ్రగ్స్ ట్రాఫికింగ్‌కు సంబంధించిన గ్యాంగ్‌ల మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యంగా జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్, శాంటారోసా డి లామా కార్టెల్ గ్యాంగ్‌ల మధ్య గొడవలు నడుస్తున్నాయి. తాజాగా సాకర్ గ్రౌండ్లో జరిగిన కాల్పులు కూడా ఈ రెండు గ్యాంగ్‌ల మధ్య వార్‌గానే అనుమానిస్తు్న్నారు.