Karimnagar | తిమ్మాపూర్, జనవరి27: ఒక్క ఐదు నిమిషాలు అయితే.. ఆ కుటుంబం గమ్యస్థానానికి చేరుకునేది. బంధువులతో సరదాగా గడిపేది. కానీ వారిపై విధి చిన్నచూపు చూసింది. దీంతో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. బంధువుల ఇంటికి కేవలం 50 మీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరగడం స్థానికంగా విషాదం నింపింది.
మంచిర్యాల జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబం సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని బంధువుల ఇంటికి కారులో బయల్దేరారు. వారు మహాత్మానగర్ చేరుకునేసరికి అర్ధరాత్రి అయ్యింది. ఇంకో ఐదు నిమిషాల్లో బంధువుల ఇంటికి చేరాల్సి ఉంది. ఇంతలో రోడ్డుపై లారీని తప్పించబోయిన కారు అదుపుతప్పింది. దీంతో పక్కనే ఉన్న చెట్టును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు చెట్టును ఢీకొన్న తర్వాత భారీగా శబ్దం రావడంతో స్థానికులు వెళ్లి చూశారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.