న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఉన్న పటిష్ఠతను భవిష్యత్తు బలహీనతలకు హామీగా భావించకూడదని, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి నిరంతర అప్రమత్తత అవసరమని రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరించారు. గత రెండు దశాబ్దాల అనుభవం ప్రస్తుతం ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతున్నది…బ్యాంకింగ్ రంగంలో ఒత్తిడి పెరిగి…ఈ సమస్య పరిష్కారానికి సంవత్సరాలు పట్టవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
2000లో ప్రారంభమైన బ్యాంకులు నిరర్థక ఆస్తుల విలువను పరిష్కరించడానికి పుష్కర కాలం పట్టిందని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదని..ఆర్థిక, బలహీనతలు పెరగనివ్వడం వల్ల కలిగే నష్టాలు అధికంగా ఉంటాయని కౌటిల్య ఎకనామిక్ ఎన్‌క్లేవ్‌లో చెప్పారు. విధాన రూపకర్తల కోసం ఐదు ప్రాధాన్యతలను ఆయన వివరించారు. ఆర్థిక స్థిరత్వం అనేది ఆకస్మిక పరిణామాలను నివారించడంపై కాకుండా, వాటి ప్రభావాన్ని తట్టుకుని నియంత్రించే ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన నొక్కి వ్యాఖ్యానించారు.
నేటి స్థితిస్థాపకత రేపటి రోగనిరోధక శక్తిని సూచించకపోవచ్చును.. ప్రస్తుతం కొత్తగా తలెత్తుతున్న బలహీనతల పట్ట అప్రమత్తంగా ఉంచడానికి దేశ ఆర్థిక వ్యవస్థను బలంగా , స్థితిస్థాపకంగా ఉంచడానికి కట్టుబడివున్నామన్నారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఆరోగ్యకరమైన బ్యాలెన్స్షీట్ల ద్వారా ఆర్థిక వ్యవస్థను లభించే స్థితిస్థాపకతను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తదుపరి ఆర్థిక సంక్షోభం ఒక బ్యాంకులోనో లేదా ఆర్థిక రంగంలోనో ప్రారంభం కానవసరం లేదని..అది ఒక భౌగోళిక రాజకీయ సంఘటన, సైబర్ దాడులు, నైతిక వైఫల్యాలతో మొదలై..పలు మార్గాల ద్వారా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయవచ్చునని ఆయన అన్నారు. ఎన్బీఎఫ్ఐలు, ఆర్థిక మార్కెట్లు, చెల్లింపు వ్యవస్థలు, సాంకేతిక మౌలిక సదుపాయాలు, కీలకమైన ఆర్థిక నెట్‌వర్క్‌ల అంతటా స్థితిస్థాపకత అవసరమని చెప్పారు.