న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: జీడీపీ పెరుగుదలలో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న భారత్.. తయారీ రంగంలో మాత్రం కొన్ని చిన్న దేశాల కంటే వెనుకబడిపోతున్నట్టు ప్రపంచ బ్యాంక్ తెలియజేసింది. రెడిమేడ్ దుస్తులు, తోలు, వస్త్ర, పాదరక్ష ఎగుమతుల్లో బంగ్లాదేశ్, వియత్నాంలు భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నది. 2022లో భారత్ వాటా 3.5 శాతంగా ఉంటే.. బంగ్లాదేశ్ 5.1 శాతంతో, వియత్నాం 5.9 శాతంతో ఉన్నట్టు తెలిపింది. 2013లో భారత్ 4.5 శాతం వాటాను అందుకున్నా.. తర్వాతి కాలంలో ఇంకా దిగజారిందన్నది. ఇక చైనా నుంచి తరలిపోతున్న పరిశ్రమల్ని భారత్ అందిపుచ్చుకోవాలంటే పన్నుల భారం తగ్గించాలని, వాణిజ్య ఒప్పందాలనూ సవరించుకోవాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. అప్పుడే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరగలవన్నది.
బ్రెయిలీలో స్టార్ పాలసీ
చెన్నై, సెప్టెంబర్ 4: అంధులు, అంధత్వ సమస్యలున్నవారి కోసం ప్రముఖ ప్రైవేట్ రంగ ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్.. తొలిసారి బ్రెయిలీ లిపిలో ఓ బీమా పాలసీని బుధవారం ప్రారంభించింది. ‘స్పెషల్ కేర్ గోల్డ్’ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీతో ఆరోగ్య సమస్యలున్న అంధులకు సమగ్ర కవరేజీ లభిస్తుందని, తమ ఆరోగ్య బీమా సమాచారాన్ని వారు సొంతంగా తెలుసుకోవచ్చని స్టార్ హెల్త్ ఎండీ, సీఈవో ఆనంద్ రాయ్ అన్నారు. అలాగే ఆరోగ్య బీమా ఏజెంట్లకూ లాభించగలదన్న ఆశాభావాన్ని కనబర్చారు.