లండన్ : ఓ షెల్టర్ హోంలో నిరాశ్రయుడితో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సాగించిన సంభాషణపై విమర్శలు వెల్లువెత్తాయి. లిజ్ ట్రస్ రాజీనామా అనంతరం బ్రిటన్ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం బ్రిటిష్ ఆర్ధిక వ్యవస్ధను గాడినపెడతానని రిషి సునాక్ పలు హామీలిచ్చారు. ఆర్ధిక మందగమనం సామాన్యుల జీవితాలపై పెను ప్రభావం చూపుతుండగా పౌరుల దుస్ధితిని ఆయన అర్ధం చేసుకోవడం లేదని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా రిషి సునాక్ ఓ సూప్ కిచెన్‌లో కనిపించిన వీడియో ఇప్పుడు వివాదాస్పదమైంది.
“Do you work in business?"
"No, I'm homeless. I'm a homeless person."
Excruciating.pic.twitter.com/mtd9pYBOt0
— Angela Rayner 🌹 (@AngelaRayner) December 24, 2022
లేబర్ పార్టీ ఎంపీ ఏంజిలా రేనర్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. షెల్టర్ హోంలోని సూప్ కిచెన్‌లో ఓ నిరాశ్రయుడితో సునాక్ ముచ్చటించిన వీడియో ఆధారంగా ప్రతిపక్షం ఆయనను ఎండగడుతోంది. ఈ వీడియోలో నీకు ఎలాంటి ఆహార పదార్ధాలు ఇష్టమని నిరాశ్రయుడిని సునాక్ అడగ్గా మీరు ఆర్ధిక వ్యవస్ధను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారా అని నిరాశ్రయుడు అడిగారు. ఆ విషయం దాటవేసిన సునాక్ నీవు వ్యాపారం చేస్తావా అని అతడిని అడగటం విస్మయపరిచింది.
తనకు ఉండేందుకు ఇల్లు లేదని, క్రిస్మస్ సమయంలో తనకు తాత్కాలిక వసతి కల్పించాలని కూడా సునాక్‌ను అతడు కోరాడు. తాను నిరాశ్రయుడనని, అయినా తనకు వ్యాపారం పట్ల ఆసక్తి ఉందని బదులిచ్చాడు. నిరాశ్రయుడి ఇబ్బందులను గుర్తించేందుకు విస్మరించిన సునాక్ తమ సంభాషణను పొడిగిస్తూ ఫైనాన్స్‌లో కెరీర్‌పై ముచ్చటించారు. నిరాశ్రయుడి గోడు పట్టించుకోకుండా ఫొటోల్లో ఫోజుల కోసం సునాక్ తంటాలు పడ్డారని విపక్షాలు భగ్గుమన్నాయి. షెల్టర్ హోంలు, సూప్ కిచెన్లు అవసరం లేని విధంగా ఆర్ధిక వ్యవస్ధ పటిష్టతకు సునాక్ గట్టి చర్యలు చేపట్టాలని నెటిజన్లు కోరారు. ప్రజల అవసరాల పట్ల రిషి సునాక్ సానుభూతితో వ్యవహరించాలని యూజర్లు కామెంట్ చేశారు.