న్యూఢిల్లీ: ఇంటి ఆవరణలోని స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న ఓ మహిళకు ఆస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. దాంతో ఆమె ఈదలేక నీటిలో మునిగిపోతున్నది. ఇది గమనించిన ఆ మహిళ పదేండ్ల కొడుకు పరుగున వచ్చి, స్విమ్మింగ్ పూల్లో దూకి.. మునిగిపోతున్న తన తల్లిని పూల్ మెట్ల వరకు లాక్కొచ్చాడు. అంతకంటే మీదకు లాగడానికి బలం చాలకపోవడంతో.. అరుస్తూ తన తాతయ్య వచ్చే వరకు తల్లి తల నీళ్లలో మునగకుండా పైకి లేపి పట్టుకున్నాడు.
ఆ తర్వాత వాళ్ల తాతయ్య వచ్చి మహిళను బయటికి తీసుకొచ్చాడు. అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో ఆగస్టు 6న ఈ ఘటన జరిగింది. బాలుడు మహిళను కాపాడే సమయంలో వారి పెంపుడు కుక్క కూడా స్విమ్మింగ్ పూల్ మెట్ల మీది వరకు పరుగున వచ్చింది. అవసరమైతే పూల్లో దూకేందుకు సిద్ధమైంది. మహిళ ఇంట్లోని సెక్యూరిటీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
బాధిత మహిళే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన పేరు లారీ కీనీ అని, తనను కాపాడిన తన కొడుకు పేరు గవిన్ అని పోస్టులో పేర్కొంది. ఈ వీడియోకు వేలల్లో వ్యూస్, వందల్లో కామెంట్లు వస్తున్నాయి. నీ కొడుకు నిన్ను కాపాడిన దేవుడు. అతనొక హీరో అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. గాడ్ బ్లెస్ యు గవిన్. నువ్వు మీ అమ్మ పాలిట దేవుడివి అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..