ధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యావత్ దేశాన్ని కార్పొరేటీకరణ చేసేందుకే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. ఈ చట్టాలు అమలైతే దేశంలో ఏ రైతూ మిగలడు. రైతు అస్తిత్వానికి, రైతు మనుగడకే ప్రమాదం. అందుకే కేంద్రం తీసుకువచ్చిన ఈ నల్ల చట్టాలను రద్దుచేయాలని గత 14 నెలలుగా దేశవ్యాప్తంగా రైతులు తమ నిరసనలను తెలియజేస్తున్నారు. రోడ్లపైనే జీవిస్తున్నారు. తిండి తిప్పలు మాని పోరాటం చేస్తున్నారు. తమ కుటుంబాలను సైతం విడిచి ఉద్యమ బాట పట్టారు. ఇది జీర్ణించుకోలేని కేంద్రం రోడ్లపై మేకులు దించినది మొదలు జల ఫిరంగులు, లాఠీ దెబ్బలు, చివరికి కార్లతో తొక్కించి హత్యలు కూడా చేయడం జరిగింది.
ఈ ఘోరం చూసిన యావత్ దేశం ముఖ్యంగా సీపీఐ, సీపీఎం, మిగతా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు రైతులకు మద్దతు తెలిపాయి. ఈ నల్ల చట్టాలను రద్దుచేయాల్సిందేనని పట్టుబట్టాయి. ఇది ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం రైతుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు చేయని కుట్రల్లేవు. ఎన్ని చేసినా వెనుకకు తగ్గని మోదీ ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో వణుకు పుట్టించింది. యావత్ తెలంగాణ ప్రభుత్వమే ధర్నాకు దిగేసరికి మిగతా రాష్ర్టాల్లో కూడా ఈ అగ్గి రాజుకుంటుందనే భయం, మరోపక్క త్వరలో ఐదు రాష్ర్టాల్లో జరిగే ఎన్నికల్లో ఎక్కడ ప్రజాగ్రహానికి గురవుతామోనే భీతితో ప్రధాని మోదీ వెనుకడుగు వేయాల్సి వచ్చింది.
గత 14 నెలలుగా 11 సార్లు రైతులతో చర్చలు జరిగినా, 700 మందికి పైగా రైతులు బలిదానాలు చేసినా స్పందించని మోదీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించి, రైతులను క్షమాపణలు కోరింది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ఇది రైతుల విజయం. అమరుల త్యాగఫలం. ఈ సందర్భంగా వారికి జోహార్లు.
నరేంద్ర మోదీజీ రైతుల డిమాండ్లలో కనీస మద్దతు ధర అయినటువంటి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను చట్టబద్ధం చేసి అమలుచేయాలని, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, అలాగే బలిదానాలు చేసిన రైతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, పార్లమెంటులో ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు బిల్లు పాస్ చేయడమే కాకుండా, దీంతో పాటు విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోవాలి. అలా చేసిననాడే రైతులపై తమకున్న ప్రేమ నిజమని ప్రజలు నమ్ముతారు. సాగు చట్టాల రద్దు కేవలం ఎన్నికల స్టంట్ కోసం కాదని మోదీ ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇవన్నీ ముందే గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెడుతున్నప్పుడే వ్యతిరేకించింది. అంతేకాకుండా బంద్కు పిలుపునిచ్చింది. రైల్ రోకోలు, రాస్తారోకోలు, ధర్నాలు చేసింది. నూతన వ్యవసాయ చట్టాలు ఎలా ఉన్నా సరే.. కొనుగోళ్లు కేంద్రాల్లో రైతు పండించిన ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చి అమలుచేస్తున్నది. ఇప్పుడు ఎక్కడికక్కడ కల్లాల్లో పేరుకుపోతున్న వడ్లను కేంద్రమే కొనాలంటూ ఢిల్లీ వెళ్లి కొట్లాడుతున్నది.
అన్నింటిని మించి ఉద్యమంలో బలైన రైతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం వంతుగా ఒక్కొక్కరికి 3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కో అమరుడికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా ప్రత్యేక, హృదయపూర్వక ధన్యవాదాలు. (వ్యాసకర్త సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి)