హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కొత్త క్రిమినల్ చట్టాల అమలులో డిజిటల్ వేదికల వినియోగం, వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం అందించేందుకు డిజిటల్ వేదికలను సమన్వయం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీసు దర్యాప్తు నుంచి ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్, న్యాయస్థానాలు, జైళ్లవరకు ప్రతి వ్యవస్థ సమన్వయంతో పనిచేసినప్పుడే సత్వర న్యాయం అందుతుందని పేరొన్నారు. తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ, తెలంగాణ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ‘కొత్త క్రిమినల్ చట్టాలు: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ బలోపేతం’ అనే అంశంపై ఇటీవల ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చీఫ్ జస్టిస్ మాట్లాడారు. న్యాయం అనేది వివిధ సంస్థలు సమన్వయంతో కలిసి పనిచేసినప్పుడే సాధ్యమయ్యే సామూహిక ఫలితం అని అన్నారు. ఈ సదస్సు ఒకరోజు చర్చగా మిగులకుండా నిరంతర సంస్థాగత భాగస్వామ్యానికి నాంది కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షురాలు జస్టిస్ మౌషమీ భట్టాచార్య మాట్లాడుతూ కొత్త క్రిమినల్ చట్టాల సమర్థవంతంగా అమలు కోసం శాఖల మధ్య మెరుగైన సమన్వయం, డిజిటల్ వేదికలపై అవగాహన అవసరమని అన్నారు.
శిక్షణ, డిజిటల్ లిటరసీ పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు. డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. కొత్త క్రిమినల్ చట్టాలు గత చట్టాలకు కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే కాదని, పౌర కేంద్రిత న్యాయవ్యవస్థ దిశగా కీలక మార్పులను తీసుకొచ్చాయని అన్నారు. శాస్త్రీయ దర్యాప్తు, డిజిటల్ ఆధారాలు, ఎలక్ట్రానిక్ రికార్డులు, కాలపరిమితితో కూడిన విధానాలకు కొత్త చట్టాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని వివరించారు. సదస్సులో ఈ-సాక్ష్యం నుంచి ఈ-సమన్స్ వరకు డిజిటల్ విధానాలు, ఎదురవుతున్న సమస్యలు, అనుభవాలు, పరిషార మార్గాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. సదస్సులో వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.