హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గద్దర్ కూతురు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల కౌంటర్ ఇచ్చారు. ‘తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీర్.. ఈ రోజు మా జాగీర్.. రేపు మా బిడ్డల జాగీర్’ అని స్పష్టంచేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సినిమా నటుడిగా, గద్దర్ అభిమానిగా పవన్ కల్యాణ్‌ను తాము అభిమానిస్తామని వెన్నెల తెలిపారు.
అలా అని తెలంగాణ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బిడ్డగా తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఎవరినీ బాధపెట్టకుండా, హింసించకుండా తనను తాను ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారినే తెలంగాణ ఆవిర్భావానికి సాక్ష్యమని పేర్కొన్నారు. పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదని తెలిపారు.