హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 22: పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు ప్రభుత్వనికి చెంప పెట్టని బీఅర్ఎస్ జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. రాజకీయ కక్షసాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న ఈ తీర్పు అని ఇప్పటికైనా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం పనిచేయాలన్నారు. రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ర్టంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అది పీసీ ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికీ పీసీసీ నివేదికని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్న మాట ఇవ్వాళ అక్షరాలా నిజమని తేలిపోయిందన్నారు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా దేశంలోని గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ రైతుల పొలాలకు నీరు అందకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని వెంకటేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.