హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎస్ సోమేశ్‌కుమార్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఆర్అండ్బీ కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులు, ఆరిటెక్ట్లతో ఆయన సమావేశమయ్యారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన పలు దవాఖానలు, మెడికల్, నర్సింగ్ కాలేజీలకు ఆరిటెక్ట్లు రూపొందించిన డిజైన్లను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. వరంగల్‌లో కొత్తగా నిర్మించే సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్ నలువైపులా 4 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, నిమ్స్ హాస్పిటల్ విస్తరణ, సంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, రామగుండం ఏరియాల్లో కొత్తగా నిర్మించే 8 మెడికల్ కాలేజీలతోపాటు సంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట, గద్వాల, బాన్సువాడలో నిర్మించే 14 నర్సింగ్ కాలేజీల డిజైన్లను పరిశీలించి, కొన్ని మార్పులను సూచించారు. తదుపరి సమావేశం నాటికి డిజైన్ ప్లాన్స్‌ను సీఎంకు సమర్పించేందుకు సిద్ధం చేయాలని ఆరిటెక్ట్లను ఆదేశించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, వాస్తు నిపుణుడు సుధాకర్‌తేజ, పలువురు అధికారులు, హైదరాబాద్‌కు చెందిన పలు ఆరిటెక్ట్ కన్సల్టెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.