ఒకే మొక్క.. ఒక కొమ్మకు టమాట, మరో కొమ్మకు వంకాయ, వేర్ల కింద ఆలుగడ్డ! వినేందుకు విచిత్రంగా ఉన్నా,‘గ్రాఫ్టింగ్’తో ఇదంతా సాధ్యమే! అంటుకట్టే పద్ధతి.. నిన్న మొన్నటి దాకా పండ్లచెట్లలోనే కనిపించేది. ఇప్పుడు కూరగాయల తోటల్లోకీ పాకింది.తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడిని అందిస్తున్నది.
అంటుకట్టే విధానం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ, ఎక్కువగా మామిడి, జామ, ఆరెంజ్లాంటి పండ్ల చెట్లు, గులాబీ, మల్లెలాంటి పూల మొక్కల్లోనే ఈ పద్ధతిని అవలంబించేవారు. కానీ, ఇప్పుడు రకరకాల కూర గాయల మొక్కలనూ ‘గ్రాఫ్టింగ్’ ద్వారా ఏకం చేస్తున్నారు. వారణాసిలోని భారతీయ కూరగాయల పరిశోధన సంస్థ (ఐఐవీఆర్), ఇటీవలే అంటుకట్టు పద్ధతిపై కొన్ని ప్రయోగాలు చేపట్టింది. ఒకే వేరుమూలంపై టమాట, వంకాయ కాండాలను అంటుకట్టి, రెండు రకాల దిగుబడులను సాధించింది. తెలంగాణ ఉద్యానవన శాఖ కూడా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ‘గ్రాఫ్టింగ్’ ద్వారా ప్రయోగాత్మక పంటలు పండిస్తున్నది. అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నది. ఈ క్రమంలో సాధారణ రైతులు కూడా ‘గ్రాఫ్టింగ్’ పద్ధతిని పాటించాలని ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీనిద్వారా అధిక దిగుబడులు, మంచి లాభాలు పొందే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.
ఎందుకీ.. ‘గ్రాఫ్టింగ్’?
అంటు కట్టాలిలా..
వియత్నాం, తైవాన్, జపాన్, థాయ్‌లాండ్ దేశాల్లో ‘గ్రాఫ్టింగ్’ ద్వారా కూరగాయలను విరివిగా పండిస్తున్నారు. భారత్‌లో కొన్ని రకాల కూరగాయలను గ్రాఫ్టింగ్ ద్వారా ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా వంకాయ, టమాట మొక్కలను అంటుకట్టి అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు.
వీటిని అంటు కట్టొచ్చు..
అన్ని రకాల కూరగాయలను అంటు కట్టడానికి వీలుకాదు. ఒకే జాతికి చెందిన వేరు మూలాలు, కాండాలను మాత్రమే అంటుకట్టడానికి వాడాలి. వంకాయ వేరు మూలంపై టమాట, మిరప మొక్కలను అంటు కట్టవచ్చు. అలాగే, దోస వేరు మూలంపై కాకర, బీర, సొర అంటుకడితే దిగుబడి బాగుంటుంది. వారణాసిలోని ఐఐవీఆర్ గతంలో ఆలుగడ్డను వేరు మూలంగా వాడి టమాటాను అంటుకట్టింది. ‘పొమాటో’ అనే శాఖీయ సంకర రకాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పుడు 1సీ -111056 అనే వంకాయ వేరుమూలంపై ‘కాశీ సందేశ్’ అనే వంకాయ సంకర రకాన్ని, ‘కాశీ అమాన్’ అనే అధిక దిగుబడినిచ్చే రకాన్ని అంటుకట్టి, ప్రయోగాలు చేస్తున్నది.
సస్యరక్షణ
మామూలు పండ్ల తోటల మాదిరిగానే గ్రాఫ్టింగ్ మొక్కలకూ సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే, మొక్కలకు సరైన పోషకాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం ఒక హెక్టారు పొలానికి 25 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతోపాటు 150, 60, 100 కిలోల పరిమాణంలో నత్రజని, భాస్వరం, పొటాష్ వేయాలి. చీడపీడల నివారణ కోసం అవరసమైన మందులను పిచికారీ చేయాలి.
ఎక్కువ దిగుబడి..
సాధారణ టమాట, వంకాయ మొక్కల్లో ఆరు నుంచి ఎనిమిది కిలోల దిగుబడి వస్తుంది. కానీ, ఈ రెండు మొక్కలను గ్రాఫ్టింగ్ ద్వారా సాగు చేస్తే, అదనంగా మరో ఐదు కిలోల దిగుబడిని సాధించవచ్చు. గ్రామాల్లో రైతులు ఈ విధానాన్ని పాటించడం ద్వారా ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. పట్టణాలు, నగరాలలో మిద్దె తోటలు, పెరటి తోటల్లో ఈ టెక్నాలజీని ఉపయోగించి ఒకేసారి రెండు, మూడు రకాల కూరగాయలను పండించుకోవచ్చు. తక్కువ స్థలంలోనే ఎక్కువ దిగు బడిని సాధించవచ్చు.