ఖైరతాబాద్, ఏప్రిల్ 17 : పార్లమెంట్ సాక్షిగా కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఏపీ, తెలంగాణ విభజనను పాకిస్థాన్‌తో పోల్చినప్పుడు తెలంగాణకు చెందిన ఒక్క ఎంపీ కూడా స్పందించకపోవడం దారుణమని, రాష్ర్టానికి చెందిన 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీల్లో ఆవేశం చచ్చిపోయిందా తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమల్ల ప్రకాశ్ ధ్వజమెత్తారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఆత్మబలిదానాలతో తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా కుట్రలు ఆగడం లేదని వాపోయారు. ఇటీవల ఓ ఆంధ్రా ఎంపీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడని, ఏపీ సీఎం చంద్రబాబు ఏకంగా ‘తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్’ అన్నారని, అప్పుడూ ఏ ఒక్కరూ స్పందించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటును చంద్రబాబు అడ్డుకోవడం వల్లే 1200 మంది ఆత్మబలిదానం చేసుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు మరో సారి ఉద్యమ స్ఫూర్తిని చూపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని, తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించిన జర్నలిస్టులు ఈ ఉద్యమంలోనూ పాలుపంచుకొని, మార్గదర్శకులు కావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ పరాయి వ్యక్తులు విధ్వంసం సృష్టిస్తున్నారని, నిరుడు తనుగుల చెక్ డ్యామ్‌ను ఇసుక మాఫియా పేల్చివేసిందని, అప్పుడు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ సాక్ష్యాధారాలతో బయటపెట్టారని గుర్తుచేశారు.
తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకటనారాయణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేస్తామని తెలిపారు. అంబేద్కర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులు కే శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు. తెలంగాణ అస్తిత్వ వేదిక కోఆర్డినేటర్ శ్రీధర్ దేశ్‌పాండే మాట్లాడుతూ తెలంగాణ వచ్చి 12 ఏండ్లయినా ఇక్కడి అస్తిత్వాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మైనింగ్ పేరుతో దోపిడీ, సుందరీకరణ పేరుతో కూల్చివేతలు కొనసాగుతున్నాయని విమర్శించారు.
ప్రొఫెసర్ సీతారామారావు మాట్లాడుతూ తెలంగాణ పోరాటాన్ని ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. వలసవాదుల పెత్తనం పెరిగిపోతున్నదని, అంతర్గత వలసవాదులు ఉన్నారని, ఇక్కడ అస్తిత్వాన్ని అణచివేసేందుకు జరుగుతున్న కుట్రలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. రాజకీయ విశ్లేషకులు పాపారావు మాట్లాడుతూ తాను ఆంధ్రాకు చెందిన వ్యక్తినైనా తెలంగాణ ఉద్యమంలో న్యాయం ఉన్నదని తాను పాలుపంచుకున్నానని గుర్తుచేశారు.
ఈ ప్రాంతంపై తనకు మమకారం ఉన్నదని, తెలంగాణ పాటలు తనను కదిలించాయని చెప్పారు. ఆంధ్రా సెటిలర్స్ ఈ అస్తిత్వంలో ఎందుకు భాగస్వాములు కావడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో తెలంగాణ అస్తిత్వ వేదిక కన్వీనర్ పిట్టల రవీందర్, సీనియర్ జర్నలిస్టు బుచ్చన్న, ప్రభాకర్ రావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి, సైకాలజిస్టు వీరేందర్ పాల్గొన్నారు.