న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉన్నది. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 80 వేల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ తాజా నివేదిక వెల్లడించింది. కొవిడ్ సంక్షోభం తర్వాత అతి పెద్ద ఉద్యోగాల తొలగింపు ఇదేనని పేర్కొన్నది. 2021 నుంచి పది లక్షల మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడించింది. ఏఐ సంబంధిత పునర్ నిర్మాణం, ఆటోమేషన్‌కు వనరుల బదలాయింపు, మౌలిక సదుపాయాలు, సామర్థ్య పెంపునకు కంపెనీలు అధికంగా ఖర్చు చేయడం వల్ల ఉద్యోగాల కోత ఎక్కువైందని నివేదిక తెలిపింది. క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్-యాజ్-ఎ-సర్వీస్(సాస్) కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఎక్కువగా ఉన్నట్టు వివరించింది. ఆ తర్వాతి స్థానంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఉద్యోగాల కోతలో అమెరికాలోనే 77 శాతం మందిని కొలువుల నుంచి తొలగించారు. భారత్ విషయానికి వస్తే 2 వేల మందిని ఇంటికి పంపారు. కంపెనీల పరంగా చూస్తే ఒరాకిల్ 26 వేలు, అమెజాన్ 16 వేలు, మెటా 2,400 ఉద్యోగాలను తొలగించాయి.
కార్మిక శక్తి నిర్ణయాలను కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావితం చేస్తున్నదని నివేదిక తెలిపింది. అయితే ఈ తొలగింపుల్లో చాలా వరకు ఆటోమేషన్ వల్ల కాకుండా, ముందు జాగ్రత్తగా ఖర్చులను తగ్గించే చర్యల్లాగా కనిపిస్తున్నాయని విశ్లేషించింది. ‘ఏఐ భవిష్యత్తు పెట్టుబడి మాత్రమే కాదు, సంస్థాగత పునర్ నిర్మాణానికి, కార్మిక శక్తి నిర్ణయాలకు చోదక శక్తిగా మారింది’ అని నివేదిక పేర్కొన్నది.