షాద్‌నగర్, నవంబర్ 25 : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు పురుషులను ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ తిరుపతిరావు జిల్లా వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. గురువారం తన కార్యాలయంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన వైద్యాధికారులు, సిబ్బందితో మాట్లాడారు. జనాభాను నియంత్రించడంలో పురుషుల భాగస్వామ్యం ఎంతో అవసరమని చెప్పారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 4 వరకు కుటుంబ నియంత్రణపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కేవలం 5 నుంచి 15 నిమిషాల్లో పురుషులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పూర్తవుతుందన్నారు. ఈ నెల 30న సరూర్‌నగర్ పీహెచ్సీలో, డిసెంబర్1న శంషాబాద్ ఏరియా దవాఖానలో, డిసెంబర్ 2న షాద్‌నగర్ ఏరియా దవాఖానలో, డిసెంబర్ 3న చేవెళ్ల, డిసెంబర్ 4న కందుకూరు సర్కారు దవాఖానల్లో పురుషులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి, పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, విద్యా శాఖ అధికారి సురేందర్‌రావు పాల్గొన్నారు.
పురుషులు భాగస్వామ్యం కావాలి
యాచారం, నవంబర్ 25 : కుటుంబ నియంత్రణలో పురుషులు భాగస్వామ్యం కావాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెచ్‌ఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడతూ. కుటుంబ నియంత్రణకు పురుషులు వేసెక్టమీ చేయించుకోవాలన్నారు. దీనిపై పురుషులకు అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి డిసెంబర్ 4 వరకు వేసెక్టమీ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నదన్నారు. కుటుంబ నియంత్రణకు ఎలాంటి కోత లేకుండా వెసెక్టమీ చేయించుకోవాలన్నారు. ఇది కేవలం 5 నుంచి 10నిమిషాల్లో పూర్తవుతుందన్నారు. దీనిపై ఎలాంటి అపోహలు, మూఢనమ్మకాలు పెట్టుకోవద్దన్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానలో ఈనెల 30న వేసెక్టమీ కుటుంబ నియంత్రణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరాన్ని పురుషులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వెసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే రూ.1100ల నగదు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. వివరాలకు మండల కేంద్రంలో పీహెచ్‌సీని సందర్శించి వైద్యుల సలహాలు, సూచనలు పొందాలని తెలిపారు.