తిరుమల : తిరుమల ( Tirumala ) లోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ( Vasanthotsavams ) సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామి ( Malayappa Swamy ) వారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడిందని అర్చకులు తెలిపారు.

ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారని వివరించారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతోపాటు పలురకాల మధురఫలాలను స్వామివారికి నివేదించారు. ఈ వేడుకల కోసం వట్టివేరుతో ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు.

వానరులు, ఏనుగులు, సింహాలు, పులులు, నెమళ్లు, పాముల తదితర జంతువులు, పలురకాల చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి వార్లను నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకువచ్చారు. వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం శ్రీ భూ సమేత మలయప్పస్వామివారికి స్నపనతిరుమంజనం శోభాయమానంగా జరిగింది.