తిరుమల : తిరుమల వేంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీనటుడు వరుణ్‌తేజ్( Varuntej ) దంపతులు బుధవారం దర్శించుకున్నారు. మంగళవారం తిరుమలకు చేరుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) రాత్రి తిరుమల (Tirumala) లో బసచేశారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. దంపతులిద్దరికి వేదపండితులు వేదాశీర్వచనం, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అభిమానులు, భక్తులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు.
ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పెళ్లి తరువాత షూటింగ్ బిజీ వల్ల ఇన్నాళ్లకు శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగిందన్నారు. స్వామివారి సన్నిధిలో మూవీలకు సంబంధించిన విషయాలను అడగవద్దని కోరారు.
ఫిదా (Fidha) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్‌తేజ్ పలు తెలుగు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కరుణకుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజేందర్‌రెడ్డి, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న మట్కా (Matca) సినిమాలో వరుణ్ నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్ తదితరులు నటిస్తున్నారు.