అగ్రనటుడు మహేశ్‌బాబు, అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమాపై ఉన్నంత క్రేజ్ మరే సినిమాపై లేదన్నది నిజం. కేవలం టైటిల్ గ్ల్రింప్స్తోనే కథ, దాని స్థాయిని ప్రేక్షకులకి పరిచయం చేసి, సినిమాపై అంచనాలను ఆకాశంలో కూర్చోబెట్టారు రాజమౌళి. ఈ ఫాంటసీ, మైథలాజికల్ మూవీలోని ఓ ఎపిసోడ్లో మహేష్ శ్రీరాముడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. 120 పైచిలుకు దేశాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో అత్యధిక దేశాల్లో విడుదలైన భారతీయ సినిమాగా ‘వారణాసి’ రికార్డ్ సృష్టించనున్నది.
ఇదిలావుంటే.. ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొనే ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారతీయ భాషలకు సంబంధించి ఓవర్సీస్ హక్కులకు గాను రూ.160 కోట్లు ఆఫర్ చేసినట్టు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తున్నది. అయితే.. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఓవర్సీస్ రైట్స్‌లోనూ ఇన్ని కోట్లతో అమ్ముడుబోయిన తొలి ఇండియన్ సినిమాగా ‘వారణాసి’ నిలుస్తుంది. విడుదలకు ముందే రేర్ రికార్డులను సృస్టిస్తున్న ఈ సినిమా, ఇక విడుదలయ్యాక, ఎన్ని రికార్డులను బద్దలు చేస్తుందో చూడాలి.