మనోహరాబాద్, జూలై 31: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి, చెట్లగౌరారం గ్రామాల పరిధిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణ ఆలోచన విరమించుకొని, వెంటనే అక్కడి నుంచి పరిశ్రమను తరలించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. కంపెనీని పూర్తిగా తీసివేయాలని కోరుతూ రంగాయపల్లి, చెట్లగౌరారం గ్రామస్తులు శుక్రవారం మెదక్ కలెక్టర్‌కు పోస్టుకార్డులు రాసి పోస్టు చేశారు.
ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ 20 ఏండ్లుగా పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాలు ష్య ప్రభావంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని, వ్యవసాయ భూములు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారన్నారు. కలుషిత నీటి కారణంగా చర్మవ్యాధులు వస్తున్నాయని, ఉపాధి కోసం చెరువుల్లో పెంచుకునే చేపలు సైతం మృతిచెందుతున్నాయన్నారు.
గర్భిణు లు, మహిళలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, గ్రామాల్లో ప్రజల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. సమస్యలపై పలుమార్లు వినతి పత్రాలు, ధర్నా లు నిర్వహించినా జిల్లా యంత్రాం గం స్పందించలేదని విమర్శించారు. రెండు గ్రామాల ప్రజలతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిం చి, పరిశ్రమను వెంటనే తొలగించాలని లేదంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, మహిళలు, యువకులు, రైతులు పాల్గొన్నారు.