ముషీరాబాద్, నవంబర్ 7: దళిత వ్యతిరేక, మనువాద పార్టీలో చేరిన ఈటల రాజేందర్ దళితుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. సోషలిస్టు, లౌకికవాదినంటూ ఇన్నాళ్లూ ఈటల కాకమ్మ కబుర్లు చెప్పాడని, బీజేపీలో చేరడంతో ఆయన ఆత్మగౌరవం మంటగలిసిందని ధ్వజమెత్తారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అని, అట్టడుగు వర్గాల పట్ల వివక్షతో బానిసలుగా, అంటరానివారిగా చూసే ఏకైక పార్టీ కాషాయ పార్టీ అని నిప్పులు చెరిగారు. బీజేపీలో ఉండి ఆత్మగౌరవం, సిద్ధాంతం, న్యాయం అంటూ మాట్లాడటం ఈటల అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. దళితబంధు గురించి మాట్లాడే అర్హత ఈటలకు లేదని, ఆయనకు దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ పథకాన్ని అమలు చేయించాలని సవాల్ చేశారు. దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు లాంటి పథకాలను ఈటల అడ్డుకోవడాన్ని చూస్తుంటే ఆయనకు దళితుల పట్ల ఏపాటి చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతుందన్నారు. ఈటలకు నిజంగా లౌకిక, విప్లవ స్ఫూర్తి ఉంటే బీజేపీకి రాజీనామా చేసి బయటకు రావాలని డిమాండ్ చేశారు. రెచ్చగొట్టె మాటలతో ముస్లింలను కించపరుస్తున్న బీజేపీ లాంటి మనువాద పార్టీలకు మాదిగలు తగిన బుద్ధిచెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొల్లూరి వెంకట్, శ్యామ్రావు, చందు, నాగరాజు, సురేశ్, వెంకన్న, మహేందర్ పాల్గొన్నారు.