నరసింహ స్వామికి పానకం, వడపప్పు ప్రత్యేకంగా నివేదనగా సమర్పిస్తారు ఎందుకు?
విష్ణుమూర్తి దశావతారాల్లో ఉగ్రమూర్తి నరసింహస్వామి. స్వామి హుంకారాన్ని విన్నంతలోనే అంతర్గత, బహిర్గత శత్రు నాశనం జరుగుతుంది. స్వామి నామాన్ని ఉచ్చరిస్తే చాలు మృత్యుదేవత ఆ పరిసరాల్లోకి రాదని విశ్వాసం. ఉగ్రమైన స్వామి రూపాన్ని శాంతింపజేయడానికి తగిన పదార్థాలను నివేదనగా సమర్పించే సంప్రదాయం ఉంది. ఈ కారణంగానే పానకం, వడపప్పు నైవేద్యం పెడతారు. ఈ రెండూ చలువదనంతో దైవాన్ని శాంతింపజేస్తాయి. బెల్లంతో తయారుచేసే పానకాన్ని తీసుకుంటే శరీరంలో వేడి నశిస్తుంది. నానబెట్టిన పెసరపప్పుతో దేహంలోని వేడి నశించడంతోపాటు శరీరానికి పరిపుష్టి కలుగుతుంది. ఈ పదార్థాలను తీసుకున్న భక్తులకు కూడా శరీర తాపం నుంచి విముక్తి కలుగుతుంది. ఉభయ తారకంగా ఉండేలా పానకం, వడపప్పు స్వామికి నైవేద్యంగా సమర్పించే నియమం ఏర్పడింది.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370