ఇన్ఫెక్షన్ మనం తరచూ వినేదే. ఈ ఇన్ఫెక్షన్లలో రకరకాలు ఉంటాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను సీజనల్ వ్యాధులుగా పరిగణిస్తాం. రుతువు (సీజన్) మారినప్పుడల్లా. ఫ్లూ సంబంధిత వ్యాధులు విజృంభిస్తుంటాయి. వర్షకాలం, చలికాలంలో ఎక్కువగా ఇన్‌ఫ్లూయెంజా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లతో పాటు కొన్నిరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా విజృంభిస్తాయి. చాలారకాల ఇన్ఫెక్షన్లకూ విరుగుడుగా చిన్నప్పుడే టీకాలు ఇస్తారు. అయినా కొన్ని రకాల టీకాలను వయసు మీద పడిన తరువాత అంటే వృద్ధాప్యంలోనూ తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు వైద్యులు. ముఖ్యంగా చలికాలంలో పెద్దలపై ప్రభావం చూపే వ్యాధులేంటి? వాటి నివారణకు ముందస్తుగా తీసుకోవాల్సిన టీకాలు ఏవి? అవి ఎలా పని చేస్తాయి? తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం..
వయసు పైబడిన వారిలో సాధారణంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి వారు ఎక్కువగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఈ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై, దవాఖానల్లో చేరడం, పరిస్థితి ఐసీయూ వరకు వెళ్లడం, కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారవచ్చు. అయితే చలికాలంలో వయసు పైబడిన వారికి, ముఖ్యంగా 65 ఏండ్లు దాటిన వారికి న్యుమోనియా ఎక్కువగా వస్తుంది. ఈ న్యుమోనియాలో రెండురకాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి. అందులో ఒకటి వైరల్ న్యుమోనియా, రెండోది బ్యాక్టీరియల్ న్యుమోనియా. ఈ వ్యాధులన్నీ నివారించగలిగేవే! ముందస్తు టీకాలు తీసుకుంటే ఈ ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు మన దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్లు వచ్చినా టీకాలు తీసుకోవడం వల్ల అవి పెద్దగా ప్రభావం చూపలేవు.
చలికాలంలో సాధారణ వృద్ధులకు ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు ఉండే తీవ్రతతో పోల్చితే, డయాబెటిస్, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో ఉండే తీవ్రత ఎక్కువ. ఎందుకంటే వయసు పైబడే కొద్దీ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ వైరస్లు వారికి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 50 ఏండ్ల వయసు దాటినప్పటి నుంచే వారికున్న వ్యాధులకు సంబంధించిన చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా నివారించేందుకు డయాబెటిస్‌ను నియంత్రించుకోవడం ఎంత ముఖ్యమో సమయానికి టీకాలు వేయించుకోవడం కూడా అంతే అవసరం.
టీకాలు అనగానే మనకు చిన్నపిల్లలు గుర్తొస్తారు. ఎందుకంటే పిల్లలకు దాదాపు పదేండ్లు వయసు వచ్చే వరకు రకరకాల టీకాలు ఇస్తున్నాం. అయితే పెద్దవారికి కూడా కొన్ని రకాలు టీకాలు అందుబాటులో ఉన్న విషయం చాలామందికి తెలియదు. 50 ఏండ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, 65 ఏండ్లు దాటిన సాధారణ వృద్ధుల కోసం ప్రత్యేక టీకాలు ఉన్నాయి. వీరికి ముఖ్యంగా చలికాలంలో ఇన్‌ఫ్లూయెంజా, న్యూమోకోకల్, షింగిల్స్ (హెర్పిస్), వారిసెల్లా (చికన్పాక్స్) తదితర ఇన్ఫెక్షన్లతో ముప్పువాటిల్లే ప్రమాదం లేకపోలేదు. అందుకని వీరికి ఇన్‌ఫ్లూయెంజా, న్యూమోకోకల్, షింగిల్స్, వారిసెల్లా టీకాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది.
ఇన్‌ఫ్లూయెంజా: ఈ టీకాను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది నాలుగు వేరియంట్లకు పనిచేస్తుంది. అందులో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2, విక్టోరియా స్ట్రెయిన్, యమగట స్ట్రెయిన్ వేరియంట్లపై పనిచేస్తుంది. ఈ టీకాను ప్రతి సంవత్సరం వేసవి ముగిసిన తర్వాత జూన్ లేదా జూలై నెలలోనే తీసుకోవాలి. చల్లని వాతావరణం ఉండే వానాకాలం, శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా బారిన పడకుండా గట్టెక్కొచ్చు.
న్యూమోకోకల్: ఈ టీకా ఊపిరితిత్తులకు వచ్చే 23 రకాల న్యూమోకోకల్ బ్యాక్టీరయల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.న్యూమోకోకల్ టీకాలో రెండు రకాలు ఉంటాయి. అవి న్యూమోకోకల్-13, పీపీఎస్వీ-23. నియమం ప్రకారం న్యూమోకోకల్-13 తీసుకున్న సంవత్సరానికి పీపీఎస్వీ-23 తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైతే న్యూమోకోకల్ -13 తీసుకున్న రెండు నెలల్లోపే పీపీఎస్వీ-23 తీసుకోవాలి. ఈ టీకాలను ఒకసారి తీసుకుంటే జీవితకాలం పనిచేస్తాయి. 65 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ టీకా తీసుకోవడం మంచిది. హెచ్ఐవీ, క్యాన్సర్, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైతే 50 ఏండ్లకే వీటిని తీసుకోవాలి.
షింగిల్స్: ఈ టీకాను 65 ఏండ్లు పైబడిన వారు రెండు డోసులు తీసుకోవాలి. మొదటి డోసు తీసుకున్న రెండు నెలల నుంచి ఆరు నెలల్లోపు రెండోది తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి జీవితకాలం పనిచేస్తాయి. ఈ టీకా ‘హెర్పిస్ జాస్టర్’ అనే వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పిస్తుంది.
వారిసెల్లా (చికన్పాక్స్): ఈ టీకాను చిన్నతనంలోనే ఇస్తారు. అయినప్పటికీ 65 ఏండ్లు దాటిన తర్వాత కూడా మరోసారి తీసుకోవడం ఉత్తమం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం 50 ఏండ్లకే తీసుకుంటే మంచిది. ఇది చికన్పాక్స్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది.