న్యూఢిల్లీ, జనవరి 22: తాజాగా కరోనా బారిన పడి కోలుకున్న వారికి టీకా ఇవ్వడాన్ని మూడు నెలల పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలు, యూటీలను ఆదేశించింది. ముందస్తు జాగ్రత్త(బూస్టర్) డోసునూ మూడు నెలల తర్వాతే వేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. శాస్త్రీయ ఆధారాలు, నేషనల్ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ సిఫారసులకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు జారీచేసినట్టు ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాస్ షీల్ పేర్కొన్నారు. అర్హులైన వారికి రెండో డోసు పూర్తైన 39 వారాల తర్వాత అంటే తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోసు వేయాలని అన్నారు. దేశంలో ఒక్కరోజులోనే (శుక్రవారం నుంచి శనివారం నాటికి 24 గంటల్లో) 3,37,704 కరోనా కేసులు వెలుగుచూశాయి.
విజృంభిస్తున్న ‘స్టెల్త్’ ఒమిక్రాన్
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కొత్త వేవ్‌లు విరుచుకుపడుతున్న సమయంలో ఈ వేరియంట్‌కు సంబంధించి మరో సబ్ స్ట్రెయిన్‌ను పరిశోధకులు తాజాగా గుర్తించారు. దీనిని బీఏ.2 (స్టెల్త్ ఒమిక్రాన్-రహస్య ఒమిక్రాన్)గా పిలుస్తున్నారు. దీని కారణంగానే డెన్మార్క్, నార్వే, స్వీడన్ తదితర దేశాల్లో ఇటీవల కేసులు భారీగా పెరుగుతున్నాయని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది. గతేడాది డిసెంబర్లో గుర్తించిన ఈ సబ్ స్ట్రెయిన్ ఇప్పటికే 40 దేశాలకు వ్యాపించినట్టు తెలిపారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ ప్రత్యేకమైన ఉత్పరివర్తనాన్ని కలిగి ఉంది. అయితే, బీఏ.2లో అలాంటి లక్షణాలేమీ లేవు. అయినప్పటికీ ఆర్టీ-పీసీఆర్ టెస్టులో దీని ఉనికి కనిపిస్తున్నది. అందుకే దీన్ని రహస్య ఒమిక్రాన్‌గా పిలుస్తున్నారు.
క్లాత్ మాస్కులు వేస్ట్
న్యూఢిల్లీ, జనవరి 22: క్లాత్ మాస్కులు కరోనా సహా ఏ వైరస్‌నూ అడ్డుకోలేవని అమెరికాలోని ట్యూలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మైక్రోబయాలజిస్టు చాద్ రాయ్ అన్నారు. కరోనా నుంచి రక్షణలో వాటిని వాడటం దండగ అన్నారు. కేవలం ఎన్95 మాస్కులే వైరస్ల నుంచి సమర్థ రక్షణ కల్పిస్తాయని చెప్పారు. సర్జికల్ మాస్కులు కూడా కొద్దిపాటి రక్షణ మాత్రమే కల్పిస్తాయన్నారు. కాగా, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఒమిక్రాన్ స్పైక్ ప్రొటీన్ పరమాణువు నిర్మాణాన్ని విశ్లేషించింది. ఈ బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త శ్రీరామ్ సుబ్రమణ్యం కూడా ఉన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ మిగతా వేరియంట్ల కంటే వేగంగా ఎందుకు వ్యాపిస్తుందన్నది తెలుసుకోవడంలో ఈ అధ్యయన ఫలితాలు దోహదం చేస్తాయని భావిస్తున్నారు.