Land Scam | “సుమంత్ పిస్టల్ పెట్టి బెదిరించిండని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్టు వేం నరేందర్‌రెడ్డి మాకు చెప్పారు. డెక్కన్ సిమెంట్స్ యజమానికి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టాడని మంత్రి ఫిర్యాదు చేశారట. (నిజమేనా, ఫిర్యాదు చేశారా? అని) ఉత్తమ్ అంకుల్‌ను అడిగితేనేమో తనకు తెల్వదంటున్నాడు. డెక్కన్ వాళ్లతో మాట్లాడింది ఎక్కడ? సీఎంతోనే ఉండే రోహిన్‌రెడ్డి ఆఫీసులోనే కదా! సుమంత్‌ను వాళ్లు పిలిస్తేనే అక్కడికి వెళ్లిండు. ఆయన పోవడానికి ముందే రోహిన్‌రెడ్డి సీఎం ఆఫీసు నుంచి అక్కడికి చేరుకున్నడు. డెక్కన్ వాళ్లను పిస్టల్ పెట్టి బెదిరించినట్టు సుమంత్ మీద ఫిర్యాదు వచ్చిందంటున్నరు. మరి అక్కడే ఉన్న రోహిన్‌రెడ్డి సాక్ష్యం చెప్పాలి కదా! ఈ వ్యవహారంలో రోహిన్‌రెడ్డితోపాటు సీఎం కూడా రావాలె!
మంచిరేవులలో దేవాదాయశాఖ భూమిలో ల్యాండ్ టు ల్యాండ్ ఒప్పందంతో రోడ్డు వేసేందుకు ఒప్పుకొని, (ఆ శాఖ మంత్రిగా) మా అమ్మ సంతకం చేస్తే సీఎం ఆ ఫైల్ ఆపిండు.
వాళ్ల తమ్ముళ్ల కండ్లలో ఆనందం కోసమే ఈ పని చేసిండు!
– 2025 అక్టోబర్ 15వ తేదీన, రాత్రి 11 గంటలకు, మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన ఈ సంచలన ఆరోపణలు గుర్తున్నాయా! లేకుంటే గుర్తు తెచ్చుకోండి. కాసేపు అక్కడే ఆగిపోండి!

ముఖ్యనేతకు ఒక మహిళా మంత్రికి మధ్య చిచ్చు రగలడానికి కారణం ఏమిటి? మంత్రి సంతకం పెట్టిన ఫైలును ముఖ్యనేత ఎందుకు ఆపారు? ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ గురిపెట్టే పరిస్థితికి కారకులు ఎవరు? మంత్రి ఇంటి దాకా పోలీసులు ఎందుకు వెళ్లారు? బజారున పడ్డ పంచాయితీ అకస్మాత్తుగా ఎందుకు సద్దుమణిగింది? ఎవరెవరు దీనిలో మధ్యవర్తిత్వం చేశారు? జూబ్లీహిల్స్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ఇందులోకి ఎలా వచ్చింది? మాస్టర్‌ప్లాన్‌లో ఉన్న వందఫీట్ల రోడ్డు ఎవరికోసం దారి మార్చుకున్నది? ఇలా అనేక ప్రశ్నలకు జవాబులు పై పదాల్లో దాగి ఉన్నాయి. ఆ పదాలన్నింటినీ కలిపితే, థ్రిల్లర్ సినిమాను సైతం మరిపించే సస్పెన్స్ థ్రిల్లర్ కుంభకోణం వెలుగులోకి వస్తుంది.
రాజమౌళి సినిమాను మించిన ట్విస్టులు దర్శనమిస్తాయి. పైకి కనిపించే పాత్రల కంటే తెరవెనుక కథను రక్తికట్టించిన సూత్రధారులు మరింత ఆసక్తికరంగా కనిపిస్తారు. ప్రభుత్వం, అధికారం, వ్యాపారం, స్వప్రయోజనాలు, మీడియా ముసుగులోని దళారులు ఒక్కటైతే ఏం జరుగుతుందో అదే జరిగింది. ఓ పారిశ్రామికవేత్త, ఒక టీవీ చానల్, పలువురు బిల్డర్లు, ముగ్గురు మంత్రులు, బిగ్ బ్రదర్స్… ఎవరి ప్రయోజనం వారు దక్కించుకోవడానికి రక్తికట్టించిన ఫక్తు దళారీ దందా. రీల్ సినిమాను తలదన్నే ‘రియల్టీ’ సినిమా. సీఎం నివాసానికి కూతవేటు దూరంలోని రోహిన్‌రెడ్డి ఇంట్లో పారిశ్రామికవేత్తకు పాయింట్ బ్లాంక్‌లో గన్ పెడితే… అది మంచిరేవులలో ‘రియల్టీ’ బుల్లెట్ రూపంలో బయటికొచ్చి ‘భూ’ కైలాస్ సినిమా చూపించింది. ఇందులో వందల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం, తద్వారా ప్రభుత్వ పెద్దలకు చేకూరే రహస్య, బహిరంగ ప్రయోజనాలు విస్తుగొలుపుతున్నాయి. ఇదే క్రమంలో గుడినే కాదు, గుడిలో లింగాన్ని సైతం మింగినట్టు 114 ఎకరాల దేవాదాయ భూములకూ ఎసరు పెట్టడం మరో విశేషం.
ముఖ్యనేత ఇంటికి కూతవేటు దూరంలో, ఒక కంపెనీ యజమానికి తుపాకీ గురిపెట్టిన మంత్రి ఓఎస్డీ వ్యవహారం ఎందుకు చప్పున సైలెంటైంది? అనే ప్రశ్నకు జవాబు తెలుసుకునేందుకు C కొన్ని నెలలుగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఫలితం..

సుస్మిత.. మంత్రి సురేఖ ఓఎస్డీ.. డెక్కన్ సిమెంట్స్ ఓనర్స్… ఓ టీవీ చానల్ యాజమాన్యం.. ముఖ్యనేత సన్నిహితుడు.. బిగ్ బ్రదర్స్.. పీసీసీ ముఖ్యనేత బావ..
జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ.. మంచిరేవులలో బిల్డర్ భూమి.. అనేకమంది బిల్డర్ల వెంచర్లు.. 114 ఎకరాల ఎండోమెంట్ భూమి.. సర్కారీ భూమిలో వంద ఫీట్ల రోడ్డు..
తలాతోకా లేకుండా రాశారేమిటి… ఒకదానికి మరొకటి సంబంధం లేకుండా పేర్చారేమిటి.. అని తికమకపడుతున్నారా? తిట్టుకుంటున్నారా? కాస్త ఆగండి. ఇవేమీ పజిల్ పదాలు కావు. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో అత్యంత విలువైన భూములున్న మంచిరేవులలో భారీ భూదందాకు పెద్దలు ఎట్లా తెరలేపారో తెలియజేసే కీవర్డ్ ్స. చూడడానికి ఇవి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ అన్నింటినీ కలిపితే, అది అతి భారీ భూ కుంభకోణమై కండ్లముందు అవతరిస్తుంది.
ఈ వ్యవహారం ఒక్క జూబ్లీసొసైటీకో, డెక్కన్ సిమెంట్స్కో, మంత్రులకో, బిగ్ బ్రదర్స్కో, బిల్డర్స్కో మాత్రమే సంబంధించిన అంశం కాదు. అధికారం, రాజకీయం కుమ్మక్కై ప్రజా ధనాన్ని ఎలా దోచుకుంటున్నారో, ప్రభుత్వ ఆస్తులను ఎలా చెరబడుతున్నారో, చట్టాలను ఎలా తుంగలో తొక్కుతున్నారో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ.
నిరుపేదలు 40 గజాల్లో గుడిసె వేసుకొని బతికితే భరించలేని ప్రభుత్వం, సామాన్యుడు పైసాపైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లును ఎఫ్టీఎల్, శిఖం భూముల పేరుతో బుల్డోజర్లు పంపి కూల్చుతున్న అధికారగణం.. అక్రమంగా కోట్లు దండుకుంటున్న పెద్దలకు మాత్రం వత్తాసు పలుకుతున్నది. కేవలం 30 ఫీట్ల రహదారి కోసం మొదలైన ఈ వేట ఏకంగా రూ.వేల కోట్ల దందాకు తెరలేపింది. 114 ఎకరాల దేవాదాయ భూములకూ ఎసరు పెట్టింది. ప్రభుత్వానికి, ప్రజలకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నది.
వాన పామును చిన్న పాము, చిన్న పామును పెద్ద పాము, పెద్ద పామును కొండ చిలువ మింగినట్టు, చిన్న పైరవీతో మొదలైన కథ.. చివరికి వందల కోట్ల బిగ్ భూ కుంభకోణంగా ఎలా మారిందో తెలుసుకోవాలంటే మూడు ఎపిసోడ్లు చదవక తప్పదు. అందులో తొలి ఎపిసోడ్ జూబ్లీహిల్స్ సొసైటీ దగ్గర మొదలవుతుంది.
ఒక దగ్గర గన్ గురిపెడితే.. మరో దగ్గర పేలింది! ఒకరు ట్రిగ్గర్ నొక్కకపోయినా.. ఇంకో దగ్గర బ్లాస్ట్ జరిగింది! బద్ధలైంది మాత్రం.. 16 ఎకరాల చుట్టూ అల్లుకున్న భూకుంభకోణం! జూబ్లీ కొండల్లో మొదలై.. మంచిరేవులలో తేలిన బిగ్ దందా! 8 నెలల కిందటి ఓ సంఘటనతో మొదలై.. తీగలాగితే కదిలిన డొంక! విచిత్రమేమిటంటే.. ఇందులో థ్రిల్లర్ సినిమాలాంటి ట్విస్టులున్నాయి. మల్టీ యూనివర్స్ లాంటి పలురంగాల మహా ముదురు క్యారెక్టర్లున్నాయి. ప్రభుత్వ పెద్దలు, బిగ్ బ్రదర్స్, మీడియా అధిపతి, అధికారులు, దళారులు, హౌసింగ్ సొసైటీ.. ఇట్లా ఎవరి గేమ్ వారిదే! ఆ భూమి కోసం ఒకరికి తెలియకుండా ఒకరు కుట్రలు పన్నారు. ఒకరిని పక్కకునెట్టి మరొకరు కథ నడిపించారు. మొత్తంగా అధికారం, రాజకీయం కలగలిసి.. రక్తికట్టిస్తున్న హైప్రొఫైల్ ల్యాండ్ గ్రాబింగ్ ఇది!

మరి… ఇలాంటి ప్రముఖులు సైతం ‘లా పతా’ అట! అంటే ఆంగ్లంలో ‘నాట్ ట్రేసబుల్’. తెలుగులోని వాడుక భాషలో చెప్పాలంటే ‘కనిపించడం లేదు’ అన్నమాట. అవును నిజమే! తెలుగు రాష్ర్టాల్లోనే బాగా డిమాండ్, పేరు ఉన్న జూబ్లీహిల్స్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ (జూబ్లీ సొసైటీ) కార్యవర్గానికి మాత్రం వీళ్లు దొరకడం లేదట. కనీసం అందుబాటులోకి కూడా రావడం లేదట. అందుకే సొసైటీ అధ్యక్షుడు బీ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన సొసైటీ కార్యవర్గ సమావేశాల్లో పట్టుబట్టి, వెంటబడి మరీ ఈ అంశాన్ని ఒక ఎజెండాగా చేర్చి వీళ్ల సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 887 మంది సభ్యత్వాన్ని నాట్ ట్రేసబుల్ పేరిట, కేవైసీ లేదనే సాకుతో రద్దు చేశారు. వీరంతా సమాజంలో వివిధ రంగాల్లో పనిచేస్తూ సుపరిచితులుగా ఉన్నారు. అయినా చిరునామాలు దొరకడంలేదంటూ సొసైటీ సభ్యత్వాలను రద్దు చేయడంతో అనేకమంది హైకోర్టును ఆశ్రయించారు. మరి అడ్డగోలుగా సభ్యుల తొలగింపు ఎందుకు చేయాల్సి వచ్చింది? దీనివెనక పెద్ద తతంగమే ఉన్నది.

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 2024 మార్చి వరకు 4,962 మంది సభ్యులున్నారు. వీరిలో 3035 మంది స్థలం పొందగా, మిగిలిన 1927 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బీ రవీంద్రనా థ్‌కు సొసైటీ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని తెలిసిందట. దీంతో తన వర్గం సభ్యులను పెంచుకోవాలని, ఓటుబ్యాంకు తయారు చేసుకోవాలని ప్లాన్ వేసినట్టు ఆరోపణలున్నాయి.
అలా జరగాలంటే ఖాళీలు ఏర్పడాలి కదా? నిబంధనల ప్రకారం సొసైటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఐదువేలు దాటకూడదు. అందుకే రవీంద్రనాథ్ వివిధ కారణాలు చూపి 887 మంది సభ్యులను తొలగించారని, వారి స్థానంలో తనకు అనుకూలంగా ఉన్న వారికి సభ్యత్వం ఇచ్చి ఎన్నికల్లో గట్టెక్కాలన్నది ఆయన ప్లాన్ అని వైరి వర్గం ఆరోపణ. కో-ఆపరేటివ్ చట్టంలోని సెక్షన్-19 ప్రకారం సొసైటీలో స్థలం పొందని సభ్యులు 10 శాతానికి మించొద్దు. అంటే జూబ్లీహిల్స్ సొసైటీలో స్థలం లేనివాళ్లు 500 మందికి మించరాదు. కానీ అప్పటికే స్థలాలు లేనివాళ్లు 1,927 (38 శాతం) మంది ఉన్నారు. పైగా వారికి ఇవ్వడానికి సొసైటీ వద్ద భూములూ అందుబాటులో లేవు. 887 మంది సభ్యులను తొలగించినా, స్థలాలు పొందనివారి సంఖ్య 20 శాతానికి పైగానే ఉంటుంది. ఈ క్రమంలోనే కొత్త సభ్యుల కోసం రంగం సిద్ధమైంది. సొసైటీ నిబంధనల ప్రకారం, స్థలం ఉన్నవారికి మాత్రమే సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుందట. అంటే ఎన్నికల్లో గెలవాలంటే కొత్త సభ్యులనూ తీసుకోవాలి. వారికి స్థలాలనూ సమకూర్చాలి. లేదా సమకూర్చినట్టు చేయాలి. ఇదీ లెక్క! సరిగ్గా ఇక్కడే సరికొత్త నాటకానికి తెరలేచింది. అయితే ఆ నాటకం తెలుసుకోవాలంటే కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి రావాలి.

సూర్యాపేట జిల్లాలోని సైదుల్నామా రిజర్వు ఫారెస్టులో డెక్కన్ సిమెంట్స్ కంపెనీ అక్రమంగా మైనింగ్ చేస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి. డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యం, అనుమతిలేని అటవీ భూమిలోకి ప్రవేశించి మైనింగ్ చేయడంతోపాటు, ఆక్రమించుకున్న అటవీ భూమిలో ఇతర కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నదని ఒక సామాజిక కార్యకర్త చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. దీన్ని వెలుగులోకి తీసుకురావాలని ఆయన ఒక టీవీ చానల్ యాజమాన్యాన్ని ఆశ్రయించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
కొద్దిరోజుల పాటు విషయాన్ని చాపకింద పెట్టిన సదరు చానల్ యాజమాన్యం, ఈ వ్యవహారంపై తాము కథనాలు ప్రచురించలేమని ఆయనకు తేల్చిచెప్పిందట. వ్యవహారం కీలక మలుపు తిరిగింది ఇక్కడే. తిప్పింది ఆ టీవీ చానల్ యాజమాన్యమే. డెక్కన్ సిమెంట్స్ అక్రమాలపై కథనాలు ప్రసారం చేయలేమని ఆ సామాజిక కార్యకర్తకు చెప్పిన టీవీ చానల్ యాజమాన్యం, ఆయన ఇచ్చిన ఆధారాలను చూపుతూ, డెక్కన్ సిమెంట్స్‌తో సెటిల్మెంట్కు వెళ్లిందట! మైనింగ్ అక్రమాలపై తమ టీవీలో కథనాలు వేయకుండా ఉండడంతోపాటు, అధికార వర్గాలతో రాజీ కూడా కుదర్చడం ఈ సెటిల్మెంట్లో ముఖ్యాంశం. దీంట్లో ఎవరి వాటా వారికి ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్రమాల డెక్కన్ సిమెంట్స్‌కి, సదరు శాఖ మంత్రికి రాజీ కుదిరిన వ్యవహారం జిల్లా మంత్రికి తెలిసిందట. దీంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారని, తన ఇలాకాలో, తనకు తెల్వకుండా, తన ప్రమేయం లేకుండా ఎలా ఇలాంటి సెటిల్మెంట్లు చేస్తారని ఆయన హర్ట్ అయ్యారని సమాచారం. దీనిపై వెంటనే ముఖ్యనేతకు ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. దీంతో ఈ వివాదాన్ని సెటిల్ చేయాలని ముఖ్యనేత తన సన్నిహితుడిని పురమాయించారట. ఆయన డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని తన ఇంటికి రప్పించడం, మంత్రి ఓఎస్డీని కూడా అక్కడికే పిలిపించడం, అక్కడే పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ గురిపెట్టే ఎపిసోడ్ జరగడం, సదరు మంత్రి కుమార్తె బహిరంగంగా వీటిని వెల్లడించడం, తర్వాత కథ కంచికి వెళ్లడం తెలిసిందే. కానీ ఈ పరిణామాలతోనే కథ కీలకమైన మలుపు తిరిగింది.

డెక్కన్ సిమెంట్స్ సెటిల్మెంట్ వ్యవహారం ఎదురు తన్నినప్పటికీ, ఇందుకోసం చేసిన ప్రయత్నాలతో సదరు టీవీ చానల్ యాజమాన్యానికి, మంత్రికి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని సమాచారం. దీంతో ఆయన కొత్త పైరవీలు మొదలుపెట్టారట. ఇదే సమయంలో మంచిరేవులలోని ఓ భూమి విషయం ఆ టీవీ చానల్ యజమాని వద్దకు వచ్చింది. ఒక బిల్డర్‌కు మంచిరేవుల గ్రామ పరిధిలో అత్యంత విలువైన సుమారు 16 ఎకరాల భూమి ఉన్నది. కానీ దానికి దారి లేదు. ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు నుంచి వచ్చే వంద ఫీట్ల రహదానికి ఈ 16 ఎకరాల భూమికి నడుమ దేవాదాయ శాఖ భూమి అడ్డంగా ఉంది.
ఇవి శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందినవి. ఆ భూముల్లోంచి రోడ్డు కావాలని బిల్డర్ చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత బిగ్ బ్రదర్స్‌ను కలవడంతో ఆ వ్యవహారమేదో భారీ భూ స్కెచ్‌కు పనికొస్తుందని సదరు బ్రదర్స్ ఈ అంశంపై లోతుగా దృష్టిసారించారట. కేవలం 16 ఎకరాలే కాదు… న్యాయ వివాదాల్లో ఉన్న 114 ఎకరాల దేవాదాయ భూమితో పాటు ఇతర బిల్డర్లకు చెందిన భూములు ఉన్నందున పెద్ద ఎత్తున రోడ్డును నిర్మిస్తే భారీ ఎత్తున సొమ్ము చేసుకోవచ్చని ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. కానీ సదరు 16 ఎకరాల భూ యజమాని అప్పటికే తనకు పరిచయమున్న టీవీ చానల్ యజమాని ముందు ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. అప్పటికే డెక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో దేవాదాయ శాఖ మంత్రితో కొంతమేర లావాదేవీలు నడిపిన నేపథ్యంలో 16 ఎకరాల భూమికి దారి అంశాన్ని కూడా తాను పరిష్కరిస్తానని టీవీ చానల్ యజమాని భరోసా ఇచ్చారట. వెంటనే మంత్రితో మాట్లాడటంతో దేవాదాయ శాఖ భూమిలో 30 ఫీట్ల రోడ్డు నిర్మాణాన్ని ‘భూమికి భూమి’ ప్రాతిపదికన ఇచ్చేందుకు ఫైల్ తయారైందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సాంకేతికంగా చూస్తే 30 ఫీట్ల రహదారి వస్తే సదరు భూ యజమాని అందులో విల్లాల నిర్మాణాన్ని చేపట్టవచ్చు.

సదరు టీవీ చానల్ యాజమాన్యం జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో 16 ఎకరాలకు రోడ్డు ఇప్పిస్తే, సెటిల్‌మెంట్‌తోపాటు, సొసైటీలో కొత్త సభ్యులను చేర్చుకునేందుకు ఆ భూమిని సాంకేతికంగా చూపిస్తే రెండువైపులా ప్రయోజనం చేకూరుతుందని సదరు కీలక పాత్ర స్కెచ్ వేసింది. స్థలాలుండే కొత్త సభ్యులకు క్లబ్లో ఓటు హక్కు లభిస్తుందని, తద్వారా మరోసారి క్లబ్ ఎన్నికలో గెలవవచ్చనేది ఈ స్కెచ్ అంతిమ లక్ష్యం. ఈ మేరకు ఆ భూమిలో టెంటు వేసి కొత్త సభ్యత్వ నమోదు తతంగాన్ని ముగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం… ప్రీలాంచ్ నాటకానికి తెరతీశారు.
బిల్డర్‌కు చెందిన 16 ఎకరాల భూమిలో 2024 మార్చి నెలలో ఒక టెంటు వేశారు. అక్కడ ‘జూబ్లీహిల్స్ ఫేజ్-4’ పేరుతో జూబ్లీ సొసైటీ రెసిడెన్షియల్ టవర్స్ నిర్మిస్తున్నట్టు ప్రచారం చేశారు. కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మార్చి 24న జరిగిన జూబ్లీ సర్వసభ్య సమావేశంలో టవర్స్ నమూనాను ప్రదర్శించి… 13.7 ఎకరాల్లో 40 అంతస్తుల్లో 1,910 యూనిట్లు ఉండే ఫేజ్-4 ప్రాజెక్టును చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఒక నిర్మాణ కంపెనీ సదరు భూ యజమానితో ఒప్పందం చేసుకున్నట్టు అందమైన బ్రోచర్లు ముద్రించారు. వీటిని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేతులమీదుగా అట్టహాసంగా ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు జూబ్లీ సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్, టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు, సొసైటీ రిజిస్ట్రార్‌తో పాటు పలువురు అధికార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఫేజ్ 4 ప్రాజెక్టు విలువ రూ.4 వేల కోట్లంటూ అందరినీ మభ్యపెట్టారు. ప్రీలాంచ్ ఆఫర్ కింద ఒక్కోఫ్లాట్ ఖరీదు రూ.2 కోట్లుగా నిర్ణయించారు.
సాధారణంగా జూబ్లీ క్లబ్లో సభ్యత్వం కావాలంటే బయటవారు అయితే రూ.35 లక్షలు చెల్లించాలి. వారికి ఓటుహక్కు ఉండదు. జూబ్లీ సొసైటీ సభ్యులైతే క్లబ్ మెంబర్షిప్ కోసం రూ.15 లక్షలు చెల్లిస్తే చాలు. వారికి ఓటుహక్కుతో పాటు వారి కుటుంబానికి కూడా పలురకాల ప్రయోజనాలు చేకూరుతాయి. నగరంలో చాలామంది జూబ్లీ సొసైటీతోపాటు క్లబ్ మెంబర్షిప్ కోసం చాలా రోజులుగా వేచిచూస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని.. జూబ్లీహిల్స్-4లో ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారికి సొసైటీలో సభ్యత్వం ఇస్తామని చెప్పి, వారి దగ్గర రూ.5 లక్షల బుకింగ్ అడ్వాన్స్ తీసుకున్నారు. ఓ మంత్రి కొడుకుకు 20 టోకెన్లు, మరో ముఖ్య నాయకుడికి 15 టోకెన్లు.. ఇలా తమకు నచ్చినవారికి నచ్చినన్ని ఇచ్చి 800 మంది దగ్గర డబ్బులు వసూలు చేశారనే ప్రచారం జరుగుతున్నది. అంటే అధికారికంగానే దాదాపు రూ.40 కోట్లు వసూలు చేశారు. దీనికి అదనంగా మరికొంత సొమ్మును ఎవరికి నచ్చిన రీతిలో వారు దండుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అసలు వి షయం ఏమిటంటే.. మంత్రి విడుదల చేసిన బ్రోచర్లో ఏ సర్వేనెంబర్ భూమిలో ప్రాజెక్ట్ చేపడుతున్నారో కూడా కనీసం ప్రస్తావించక పోవడం!

జూబ్లీహిల్స్ సొసైటీలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి తుమ్మల సహా అనేకమంది ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. అయినా సొసైటీ పెద్దలు ఎలాంటి జంకు లేకుండా, కనీసం రెరాకు దరఖాస్తు కూడా చేసుకోకుండా, ఎలాంటి అనుమతులు తీసుకోకుం డా, చట్ట విరుద్ధమైన ప్రీలాంచ్ ఆఫర్‌ని ప్రకటించారు. దాన్ని మంత్రితో విడుదల చేయించారు. ఈ అక్రమాలపై జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ సొసైటీ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది డాక్టర్ కొసరాజు జ్యోతి ప్రసాద్ తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(టీజీ రెరా)కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరపగా అక్రమాలు నిజమేనని తేలింది.
దీంతో రెరాలో నమోదు చేయకుండా ప్రీలాంచ్ విక్రయాలు జరిపినందుకు జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ సొసైటీకి రెరా రూ.18,51, 255 జరిమానా విధించింది. తమ ఆదేశాలు పాటించ కపోతే సెక్షన్ 63 కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అడ్వాన్స్‌ల సేకరణ, ప్రచారం ఆపాల ని ఆదేశించింది. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో కమ్యూనిటీ కేరింగ్ సొసైటీ ఆఫ్ జూబ్లీహిల్స్ అధ్యక్షుడు కే రమేశ్చౌదరి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశారు. భూమి లేకుండానే సొసైటీలో సభ్య త్వం పేరుతో ప్రీలాంచ్ అమ్మకాలు అంటూ వందలాది మంది నుంచి రూ.కోట్లు వసూలు చేసిన జూబ్లీక్లబ్ అధ్యక్షుడు రవీంద్రనాథ్, వైస్‌ప్రెసిడెంట్ డీ సునీలారె డ్డి, కోశాధికారి పీ నాగరాజుపై క్రిమినల్ చర్యలు తీసు కోవాలని కోరారు. ప్రీలాంచ్ అమ్మకాల పేరుమీద రూ.6వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని, ఇం దులో రూ.1200కోట్లను తమ సొంతఖాతాల్లోకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొ న్నారు.న్యాయవాది కొసరాజు జ్యోతిప్రసాద్ హైదరా బాద్ సీసీఎస్‌లో కూడా ఫిర్యాదు చేశారు.
ఎందుకంటే 16 ఎకరాల భూమి వ్యవహారం. ‘జూబ్లీ సొసైటీ ఫేజ్ -4’ నాటకం, దానిపై ఫిర్యాదులు, జరిమానాలు, ఇవన్నీ బిగ్ కుటుంబం దృష్టికి వచ్చాయి. ఇంత పెద్ద వ్యవహారం తాము కాకుండా వేరేవాళ్లు చేయడం ఏమిటని భావించిన బిగ్ బ్రదర్స్ రంగంలోకి దిగారు. అప్పటికే దేవాదాయ భూమిలో 30 ఫీట్ల రహదారి భూమికి భూమి ప్రాతిపదికన అప్పగించేందుకు తయారైన ఫైల్ సచివాలయానికి చేరుకుంది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న బిగ్ బ్రదర్స్ వెంటనే ఆ సమయంలో విదేశాల్లో ఉన్న ‘ముఖ్య’నేత చెవిన వేశారు. క్షణాల్లో అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో ఉన్నతాధికారులు మంత్రి నుంచి వచ్చిన ఫైల్‌ను పక్కనపడేశారు. చివరి దశలో ఫైల్ నిలిచిపోవడంతో సదరు మంత్రికి చిర్రెత్తుకొచ్చిందట. తన సోదరుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ‘భూమికి భూమి’ ఫైల్‌ను నిలిపివేశారంటూ మంత్రి వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె మీడియాతో మాట్లాడినప్పుడు మంచిరేవుల వ్యవహారాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.
‘వాళ్ల తమ్ముళ్ల కండ్లలో ఆనందం కోసమే ఈ పనిచేసిండు!’ అని సురేఖ కూతురు సుస్మిత చెప్పిన మాటల అంతరార్థం ఏమిటి? ‘భూమికి భూమి’ ఫైల్ ఆగిపోవడంతో బిగ్‌బ్రదర్స్ రంగంలోకి దిగారు. వారి రాకతో 16 ఎకరాల వ్యవహారం అనూహ్య మలుపు తీసుకున్నది. రూ.వేల కోట్ల వ్యాపారానికి తెరలేపింది. అదెలా జరిగింది? దేవాదాయ భూమిలో రోడ్డు నిర్మాణం ఆగిపోయిందా? విల్లాలు నిర్మిద్దామనుకున్న బిల్డర్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? రెసిడెన్షియల్ టవర్స్ ఎందుకు తెరమీదికి వచ్చాయి? వంటి వివరాలన్నీ